హెచ్ 1బీ వీసాదారులను వదులుకోవద్దు
ఐటీ పరిశ్రమలో భారీ లేఆఫ్‌లు కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, హెచ్ 1బి వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయిన తరవాత కూడా అమెరికాలో కొనసాగడానికి అనుమతించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యులు అమెరికా వలస వ్యవహారాల విభాగానికి లేఖ రాశారు. గతేడాది నవంబరు నుంచి దాదాపు 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు లేఆఫ్‌లు ఎదుర్కొన్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఇందులో అత్యధికులు హెచ్ 1బి, ఎల్ 1 వీసాల మీదున్నారు. నిపుణులైన ఈ సిబ్బంది వెళ్లిపోతే అమెరికా దీర్ఘకాలంలో పోటీ సత్తా కోల్పోతుందని, ఆర్థికంగా నష్టపోతుందని నలుగురు శాసనకర్తలు హెచ్చరించారు. వీరిలో భారతీయ అమెరికన్ రో ఖన్నా కూడా ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన హెచ్ 1 బి వీసాదారులకు కొత్త ఉద్యోగం వెదుక్కొనేందుకు ఇచ్చిన 60 రోజులు గ్రేస్ కాలాన్ని మరింత పొడిగించాలని వీరు కోరారు.













