కరోనా పుట్టుకపై ఆధారాలను బయటపెట్టిన… అమెరికా

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే వచ్చిందన్న వాదనకు మరింత బలం చేకూర్చే ఆధారాలను అమెరికా నిఘా విభాగం బయటపెట్టింది. 2019 నవంబర్ నెలలో వూహాన్ లోని వైరాలజీ ఇన్‍స్టిట్యూట్‍లో ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురయ్యారని తన నివేదికలో పేర్కొన్నది. వారిలో కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. వారంతా దవాఖానలో చికిత్స పొందాల్సి వచ్చిందని వెల్లడించింది. అప్పటికి చైనా ఇంకా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పలేదు. తొలి కరోనా కేసు డిసెంబర్‍లో నమోదైనట్టు తర్వాత వెల్లడించింది. ఈ ఇంటలిజెన్స్ నివేదికతో వాల్‍స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. కొవిడ్‍కు కారణమవుతున్న సార్స్ కొవ్-2 వైరస్ పుట్టుకపై దర్యాప్తు నిర్వహించే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) త్వరలో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కథనం ప్రచురించడం విశేషం. సార్స్ కొవ్-2 వైరస్ చైనాలో ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, ప్రకృతిలో సహజంగానే పుట్టి ఉండవచ్చని డబ్ల్యూహెచ్‍వో మార్చిలో ప్రకటించింది. అయితే వైరస్ పుట్టుకపై మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని బ్రిటన్, అమెరికా శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‍వో ఈ అంశంపై మళ్లీ సమావేశం కానుంది.