ప్రవాసాంధ్ర మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఉన్నత విద్యలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకుగాను ప్రవాసాంధ్ర మహిళ నీలి బెండపూడి అమెరికాలో ప్రతిష్ఠాత్మక ఇమిగ్రెంట్ అఛీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశారు. 1986లో అమెరికాకు చేరుకొని కన్సాస్ విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్‌లో డాక్టరేట్ పట్టా సాధించారు. పలు కీలక హోదాల్లో పనిచేసి, గతేడాది పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఆమే. గత 30 ఏళ్లలో ఉన్నత విద్యలో విద్యార్థులు విజయం సాధించడానికి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి నీలి బెండపూడి కృషి చేశారని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు జెరెమీ రాబిన్స్ పేర్కొన్నారు. ఈ నెల 28న ఆమె ఇమిగ్రెంట్ అఛీవ్మెంట్ అవార్డు అందుకోనున్నారు.













