భారత్ ఎనర్జీ లక్ష్యాలకు అమెరికా చేయూత
న్యూఢిల్లీః 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తిని చేరుకోవాలన్న భారత్ బృహత్తర లక్ష్యానికి అమెరికా చేయూతనందిస్తుందని అమెరికా ప్రకటించింది. భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అమెరికా సహాయం చేయడంతో పాటు, మరికొన్ని దేశాల సహాయాన్ని కూడా కూడగడుతుందని అమెరికా స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో వాతావరణ వ్యవహారాల విభాగం అధిపతి, ముఖ్య సలహాదారు అయిన జాన్ కెర్రీ, మాజీ ఇంధన శాఖ మంత్రి ఎర్నెస్ట్ మోనిజ్ల మధ్య గత వారాంతంలో ఇష్టాగోష్టి జరిగినప్పుడు కెర్రీ మాట్లాడుతూ, ‘‘2030 నాటికి 450 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఇది చాలా పెద్ద ఆశయం. ఇంధన రంగంలో ఇంత పెద్ద మార్పును, పరిణామాన్ని తీసుకు రావాలంటే ఎంత లేదన్నా 600 బిలియన్ డాలర్లు అవసరమవుతాయి. ఇందుకు అమెరికా తోడ్పాటునందిస్తుందనడంలో సందేహం లేదు. అయితే, మేం ఈ విషయంలో భారత్కు ఆర్థికంగా సహాయం చేయగల, ఇతరత్రా కూడా తోడ్పాటునందించగల దేశాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.
ఆయన ఆ దేశాల పేర్లను గానీ, ఇతరత్రా సహాయం చేయగల దేశాలు లేదా సంస్థల పేర్లను గానీ బయటపెట్టలేదు. ‘‘మేం మన దేశంలోని కొన్ని ప్రధాన పెట్టుబడి సంస్థలను, అసెట్ మేనేజర్లను సంప్రదిస్తున్నాం. భారత్ తన లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడానికి సహాయం చేయగలిగిన ప్రైవేట్ సంస్థల గురించి వాకబు చేస్తున్నాం. ఎంత వరకు పెట్టుబడులు సేకరించగలమన్నది చర్చిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.
ఈ ప్రయత్నాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని భారతీయ అధికారులు తెలియజేశారు. ఏప్రిల్ 22న బైడెన్ ప్రభుత్వం ప్రపంచ ఉన్నత స్థాయి కార్బన్ ఉద్గారక దేశాలతో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారని, అప్పుడు దీని గురించి ఒక స్పష్టత వెలువడే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ ఇష్టాగోష్టి కార్యక్రమంలో కెర్రీ మాట్లాడిన తీరును బట్టి భారత, అమెరికా సంబంధాలు క్రమంగా వాతావరణం, టెక్నాలజీ, ఇన్నొవేషన్ల వైపు మళ్లుతున్నట్టు కనిపిస్తోంది.













