చేర్చుకోం.. చేయూతనిస్తాం… నాటో వైఖరి ఇదేనా?
అగ్ర దేశాల అండతో రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న ఆశ తీరేలా లేదు. నాటోలో సభ్యత్వంపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కాలికి బలపం కట్టుకుని అన్ని దేశాలూ తిరిగి అభ్యర్థిస్తున్నా ఫలితం దక్కేలా లేదు. చేర్చుకోం.. చేయూతనిస్తాం అనేదే ఉక్రెయిన్ విషయంలో ప్రస్తుతానికి నాటో దేశాల వైఖరిగా కనిపిస్తోంది. ఒక వేళ ఉక్రెయిన్ సభ్యత్వానికి అంగీకరిస్తే అనూహ్య పరిణామాలకు, యుద్ద విస్తరణకు అది దారి తీస్తుంది. అందుకే నాటో కూటమి శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం కీలకంగా మారింది. రాజకీయ, భౌగోళిక, దౌత్యపరమైన చిక్కుముడులు ముడిపడి ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు బయటి నుంచి మద్దతుకే నాటో దేశాలు మొగ్గు చూపుతున్నాయి. అవసరమైతే మధ్యప్రాచ్యంలో గతంలో ఇజ్రాయెల్‌కు ఎలాగైతే మద్దతిచ్చి ఆ దేశాన్ని ఆర్థికంగా, ఆయుధపరంగా సొంతకాళ్లపై నిలబడేలా చేశారో అదే వ్యూహాన్ని ఇక్కడా అనుసరించాలనుకుంటున్నాయి. యుద్దం ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి ఉక్రెయిన్ను చేర్చుకునే సంగతి ఆలోచిద్దామన్నది కూటమి ఆలోచనగా కనిపిస్తోంది.













