టెక్సాస్ లో మళ్లీ కాల్పుల కలకలం..
అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినేట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అమెరికాలో తుపాకీ సంస్కృతి మహమ్మారి లాంటిదని, సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళికలు గురించి అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించిన కొన్ని గంటల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెంట్ మోరే క్యాబినేట్స్ వద్ద దాడి జరిగిందని కాల్ వచ్చిందని, ఘటనా స్థలికి వెళ్లగా అప్పటికే ఒక వ్యక్తి మరణించాడని, తీవ్రంగా గాయపడ్డ మరో నలుగుర్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మొత్తం ఈ ఘటనకు ఏడుగురు బాధితులయ్యారని తెలిపారు. నిందితుణ్ణి పట్టుకునేందుకు పోలీసులు వెంబడిస్తుండగా సదరు వ్యక్తి కాల్పులు జరపడంతో ఓ సైనికుడు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నాయి. అయితే ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడో వెల్లడికాలేదు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్ రేంజర్స్‌తో కలిసి పని చేస్తున్నామని, స్థానిక చట్ట అమలుకు సహాయం చేస్తామని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. నిందితుడి విచారణ కోసం అవసరమైన విధంగా సహాయం చేస్తామన్నారు.













