ఒమిక్రాన్ నేపథ్యంలో.. ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆంక్షలు

ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ముందు జాగ్రత్తగా పౌరుల కదలికలపై మళ్లీ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి చేశాయి. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,08,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో 12 ఏళ్ల పైబడిన పౌరులు, పర్యాటకులు నేటి నుంచి బహిరంగ స్థలాల్లో తప్పనిసరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించి వారికి 135 యూరోల జరిమానా విధిస్తారు. ఫ్రాన్స్‌లో ఇప్పటికే రైళ్లు, బస్సులు, దుకాణాలు, కార్యాలయాలలో మాస్కుల ధారణ తప్పనిసరి చేశారు. చైనాలో సుదీర్ఘ లాక్‌డౌన్‌లో ఉన్న షియాన్ నగరంలోని కోటీ 30 లక్షల జనాభాకు రోజూ ఇంటివద్దకే నిత్యావసరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నా నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసేది లేదని ప్రభుత్వం ఆంటోంది.