కోవిడ్ 19 అంతమెప్పుడు?
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు అంతం అవుతుందనే విషయమై స్పష్టంగా తెలియనప్పటికీ దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో వేసిన కమిటీ మాత్రం ఫిబ్రవరిలో అంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కూడా కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ఈ కమిటీ దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ చూపించిన ప్రభావం గురించి, ఇకపై కోవిడ్ 19 ప్రభావం ఎలా ఉంటుందనే అంశం గురించి విశ్లేషించింది. ఆ విశ్లేషణల్లో ప్రధానమైన అంశం ఏమిటంటే ఇండియాలో కోవిడ్ 19 పీక్ స్టేజ్ వచ్చి వెళ్ళిపోయిందని చెప్పింది.
గత కొన్నాళ్లుగా భారతదేశంలో కరోనా డైలీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజువారీగా 60 వేల స్థాయిలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. రికవరీల సంఖ్య కొత్త కేసుల కన్నా కనీసం పది నుంచి 15 వేల వరకు ఎక్కువగా ఉంటూ ఉంది. దీంతో యాక్టివ్ కేసుల లోడ్ తగ్గుముఖం పడుతూ ఉంది. ఒక దశలో 11 లక్షల వరకూ చేరిన యాక్టివ్ కేసుల లోడ్ ప్రస్తుతం ఎనిమిది లక్షలలోపు స్థాయికి చేరింది.
పండుగల సీజన్…కరోనా ముంచుతుందా?
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు వచ్చిన వార్తల కన్నా దసరా, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో ప్రజలంతా గుమిగూడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికితోడు ప్రభుత్వాలు పూర్తిగా పగ్గాలు వదిలేసినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పండగల సీజన్లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే శీతాకాలంలో కోవిడ్ 19 విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను ప్రజానీకం ఏ మేరకు లెక్క చేస్తుందో కానీ, జాగ్రత్తలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ సృష్టం చేసింది. జాగ్రత్తగా ఉంటేనే కోవిడ్ 19న నియంత్రించడం సాధ్యం అవుతుందని పేర్కొంది. బతుకమ్మ ఒకవైపు… గుంపులు, గుంపులుగా చేరి పండగ చేసుకుందామంటే.. గుబులు గుబులుగా ఉంది పరిస్థితి. ఓనం పండగ తర్వాత కేరళలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి కేరళీయులు కేరళకు వెళ్లడం, అక్కడ పండగను సందడిగా నిర్వహించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ, దసరా, దీపావళి పండగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ ఉత్సవాలను జరుపుకోలేదు. కరోనా నిబంధనలను పాటించకుండా పండగలను నిర్వహిస్తే వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.
తెలంగాణ పండగల్లో కీలకమైనది దసరా. బతుకమ్మ ఆటపాటలు మరీ ముఖ్యమైనవి. వీటిని ఆడపడుచులు ఒకచోట గుమిగూడి నిర్వహిస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఏడాది బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరల పంపిణీ చేపడుతోంది. బతుకమ్మ పండగను పురస్కరించుకొని మహిళలు ఒక చోట నుంచి మరోచోటకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తారు. ఆ తర్వాత క్రిస్మస్, సంక్రాంతి పండగలు వరుసగా ఉన్నాయి. వాటి విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై సర్కారులో తర్జనభర్జన సాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరుకుంది. పల్లెల్లో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజుకు పది వరకు కరోనా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.
కరోనాపై పోస్టర్లు చూశారా?
కరోనా మహమ్మారి విజృంభించకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు విస్తృత ప్రచారం చేపట్టేందుకు సర్కారు సమాయత్తమైంది. సోషల్ మీడియా సహా వివిధ రకాల ప్రచార సాధనాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ యాసలో ఆకట్టుకొనే నినాదాలు, ప్రత్యేక పాటలు సిద్ధం చేసింది. అలాగే పండుగల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. బతుకమ్మను తీసుకెళ్లే మహిళలు మాస్క్ లు ధరించి కరోనాను కట్టడి చేయాలని చెప్పేలా ప్రత్యేక పోస్టర్‌ను అధికారులు విడుదల చేశారు. ‘ఈ పండుగ వేళ శుభ్రతే మన భద్రత’, ‘కరోనాఖేల్ ఖతం చేద్దాం.. ప్రతీ ఇంటా సంబురాలు షురూ చేద్దాం’ వంటి నినాదాలను పోస్టర్లపై ముద్రిం చారు. ఇంకో పోస్టర్లో ‘మీలో ఎవరు మాస్క్ మహారాజు?’ అంటూ తీర్చిదిద్దారు. ‘మాస్క్ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు… ఆరడుగుల దూరం పాటిస్తడు’, ఇవన్నీ మీరు చేస్తుం టే మీరే మాస్క్ మహారాజు..అంటూ ఆకట్టుకొనే రీతిలో కార్టూన్లు ప్రదర్శించారు. మరో పోస్టర్లో ‘కరోనా’సురునిపై సంధించిన 3 బాణాలు చూపి స్తూ ‘కరో నా’సురుడిని అంతమొందించా లని చూపించారు. బతుకమ్మ పాటలతో రేడియో జింగిల్స్ ను తయారు చేశారు.






