రిలయన్స్ కీలక నిర్ణయం.. ఉద్యోగులందరికీ ఉచితంగా

భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కరోనా వ్యాక్సినేషన్‍కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‍లు ఇవ్వాలని నిర్ణయించింది. రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగానే వ్యాక్సిన్లు వేస్తామని, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రిటైర్డస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. వ్యాక్సిన్‍ల కోసం ఉద్యోగులు కోవిన్ పోర్టల్ లో రిజిస్టిర్ చేసుకోవాలని, అనంతరం రిలయన్స్ ఆన్‍లైన్ హెల్త్ కేర్ ప్లాట్‍ఫామ్ జియో హెల్త్ హబ్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్‍లో స్లాట్ బుక్ చేసుకోవాలని రిలయన్స్ సూచించింది.
ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుంటే, దానికి అయిన ఖర్చులను కంపెనీ చెల్లిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిలయన్స్కు చెందిన దాదాపు 3.40 లక్షల మంది ఇప్పటికే మొదటి డోస్ టీకా తీసుకున్నట్లు రిలయన్స్ వర్గాలు తెలిపాయి. జూన్ 15 నాటికి రిలయన్స్ ఉద్యోగులందరూ కనీసం మొదటి టీకా వేసుకునేలా రిలయన్స్ సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. రిలయన్స్ ఉద్యోగులతో పాటు 13,000 వేల రిలయన్స్ రిటైల్, జియో స్టోర్ సిబ్బందికి కూడా ఈ పోగ్రామ్ కింద టీకాలు వేయనున్నట్లు తెలిపింది.