వ్యాక్సిన్ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్… వెసులుబాటునిచ్చిన కేంద్రం

యువతకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో భారీ మినహాయింపునే ఇచ్చింది. 18 సంవ్సరాల నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు ఎలాంటి ముందుస్తు నమోదు లేకుండా, ఏకంగా వ్యా్క్సినేషన్ సెంటర్ వద్దకే వెళ్లి, అప్పటికప్పుడు కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని, బుక్ చేసుకున్న సమయానికి కొందరు రాలేకపోతున్నారు. దీంతో వ్యాక్సిన్ వృథా అధికమైంది. వ్యాక్సిన్ వృథాను అరికట్టడానికే కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ఈ వెసులుబాటు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద వ్యా్క్సిన్ వేసుకునే వారికి మాత్రమేనని, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద తీసుకునే వారికి ఈ నిబంధన వర్తించదని కేంద్రం పేర్కొంది. మరోవైపు కొందరికి మొబైల్స్, ఇంటర్నెట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం దృష్టికి వెళ్లింది. ఈ ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్రం. అయితే ఈ నిర్ణయం తుది అమలు ఆయా రాష్ట్రాలకే వదిలేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.