అన్ని వేళ్లూ మోదీ వైపే…! ఎందుకీ నిస్సహాయత..!?

ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ పర్సనాలిటీలలో మోదీ ఒకరు. గతంలో ఏ భారత ప్రధానమంత్రికీ రానంత పాపులారిటీ మోదీ సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోని పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. ఇంకో విధంగా చెప్పాలంటే వాళ్లను మించి పాపులారిటీ సాధించుకున్న నేతగా మోదీ చరిత్ర కెక్కారు. సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఛరిష్మా అంతా తారుమారైంది. దేశీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని వేళ్లూ మోదీ వైపే చూపిస్తున్నాయి. ఏడాదిలోనే ఎందుకిలా జరిగింది.?
గతేడాది కరోనా దేశంలోని ప్రవేశించగానే మోదీ ముందుగా మేల్కొన్నారు. జనవరిలో దేశంలో తొలి కేసు నమోదైంది. మార్చి నాటికి కేసుల పెరుగుదల పెరగడం ప్రారంభమైంది. దీన్ని బ్రేక్ చేయకపోతే తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన మోదీ.. వెంటనే రంగంలోకి దిగి లాక్ డౌన్ విధించారు. అప్పట్లో మోదీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. దేశాన్ని గెలిపించడం కోసం.. కరోనాపై విజయం సాధించడం కోసం అన్ని రాష్ట్రాలూ మోదీ మాటను గౌరవించాయి. ఆయన ఏం చెప్తే దాన్ని చేశాయి. ఇంటి గుమ్మాల ముందు నిలబడి చప్పట్లు కొట్టారు. పళ్లాలు వాయించారు. వైద్యులకు సంఘీభావంగా దీపాలు వెలిగించారు. మోదీ నిర్ణయం ఫలించింది. ఫస్ట్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కోగలిగాం. ఈ క్రెడిట్ అంతా మోదీకే ఇచ్చారు. ప్రపంచ దేశాలన్నీ మోదీ సమర్థతను మెచ్చుకున్నాయి. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన దేశాలన్నీ.. మోదీ సమర్థంగా ఎదుర్కొన్నారంటూ వేనోళ్ల పొగిడాయి. అయితే ఏడాది దాటింది. సెకండ్ వేవ్ దేశంలో ప్రవేశించింది. సెకండ్ వేవ్ రాబోతోందని ఈ ఏడాది మార్చిలోనే ఓ అత్యున్నతస్థాయి కమిటీ మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోందని.. ఆ మేరకు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ ప్రభుత్వానికి సూచించింది. కానీ ఆ కమిటీ సూచనలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీజేపీ పెద్దలంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లీనమైపోయారు. రాష్ట్రాల్లో పాగా వేయడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ పోయారు. కరోనా సెకండ్ వేవ్ ను చాలా లైట్ తీసుకున్నారు. దీంతో మహమ్మారి చాపకింద నీరులా దేశం మొత్తం కమ్మేసింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది మోదీ ప్రభుత్వం.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తెలిసినా దాన్ని కట్టడి చేసేందుకు మోదీ ముందుకు రాలేదు. మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి లాక్ డౌనే ప్రధాన కారణం. కానీ సెకండ్ వేవ్ దగ్గరికి వచ్చే సరికి లాక్ డౌన్ పెట్టేందుకు మోదీ సర్కార్ ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందేమోననే భయం మోదీ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. అంతేకాక కార్పొరేట్ల ఒత్తిడి కూడా పనిచేస్తున్నట్టు సమాచారం. లాక్ డౌన్ పెడితే వ్యాపార, వాణిజ్య రంగం కుప్పకూలిపోతుంది. అందుకే లాక్ డౌన్ వద్దని.. ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు విధించి ఆంక్షల ద్వారా కట్టడి చేయాలని సూచించారు కార్పొరేట్లు. దీంతో మోదీ వారి మాటే వినాల్సి వచ్చింది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే భవిష్యత్తులో అది మరిన్ని విపరిణామాలకు దారి తీయొచ్చనే భయం కూడా మోదీని వెంటాడుతోంది. అందుకే లాక్ డౌన్ జోలికి పోలేదు.
మరోవైపు కరోనా కట్టడికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. లాక్ డౌన్ పెట్టనప్పుడు వేవ్ తీవ్రత ఎంత ఉంటుందనేది ముందే ఊహించొచ్చు. అలా ఊహించి కమిటీ నివేదిక సమర్పించింది. మౌలిక వెంటిలేటర్లు, ఆక్సిజన్, బెడ్లు.. లాంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించింది. కనీసం ఆ దిశగా కూడా మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. ఎన్నికల్లో బిజీగా ఉండిపోవడమే ఇందుకు కారణం. అందుకే ఇప్పుడు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫస్ట్ వేవ్ లో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లారు. ఇప్పుడు పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టాలని కోరుతున్నా మోదీ నిర్ణయం తీసుకోలేదు. పైగా లాక్ డౌన్ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలిపెడ్తున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీని మొదట్లో పూర్తిగా తన ఆధిపత్యంలో పెట్టుకున్న కేంద్రం.. ఇప్పుడేమో రాష్ట్రాలకు వదిలేసింది. వ్యాక్సిన్ కంపెనీలు కూడా కేంద్రానికి ఓ రేటు, రాష్ట్రాలకు మరో రేటు నిర్ణయించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీల పైన కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కోల్పోవడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సెకండ్ వేవ్ ను నియంత్రించడంలో వైఫల్యం చెందడానికి ప్రధాన కారణం మోదీయేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రిజైన్ మోదీ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడుస్తోంది. రోజూ లక్షలాది మంది రిజైన్ మోదీ అంటూ గళమెత్తుతున్నారు. నిన్నమొన్నటి వరకూ మోదీ బెస్ట్ అని పొగిడిన నోళ్లే ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. నాడు మోదీ వల్లే విజయం సాధించామని దండం పెట్టిన చేతులే ఇప్పుడు అన్ని వేళ్ళూ మోదీ వైపు చూపిస్తున్నాయి. ఏడాదిలో ఎంత తేడా..?