30 నిమిషాల్లోనే కరోనా ఫలితం …

స్మార్ట్‌ఫోన్ తో కరోనా పరీక్ష చేసే సరికొత్త పద్ధతిని అమెరికాలోని గ్లాడ్‍స్టోన్ ఇన్‍స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫోన్‍లోని కెమెరాను మైక్రోస్కోపులా వాడుకొని, శాంపిల్‍ను స్కాన్ చేసి 30 నిమిషాల్లోనే పరీక్షా ఫలితాన్ని ఇవ్వడం ఈ టెస్టు ప్రత్యేకత. జన్యు ఎడిటింగ్‍కు వడే క్లస్టర్డ్ రెగులర్లీ ఇంటర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ (సీఆర్‍ఐఎస్‍పీఆర్) పరిజ్ఞానంతో ఈ పరీక్ష చేస్తారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన అన్ని రకాల సీఆర్‍ఐఎస్‍పీఆర్ పరీక్షా పద్ధతుల్లోనూ వైరస్‍కు సంబంధించిన రైబో న్యూక్లిక్ యాసిడ్(ఆర్‍ఎన్‍ఏ)ను డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్(డీఎన్‍ఏ)గా మార్చాల్సి వచ్చేది. అనంతరం ఆ డీఎన్‍ఏ సంఖ్యను కృత్రిమంగా పెంచిన తర్వాతే.. ఇన్ఫెక్షన్ కారకం జాడను గుర్తించే వీలుండేది. కొత్త పద్ధతిలో ఆ రెండు దశల అవసరం ఉండదని ఈ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన 2020 రసాయన శాస్త్ర నోబెల్ గ్రహీత జెన్నిఫర్ డౌద్న వెల్లడించారు.
ఈ టెస్టులో తొలుత కొవిడ్ లక్షణాలున్న వ్యక్తి నుంచి సేకరించిన ముక్కు స్రావాల నమూనాను సీఏఎస్13 అనే ప్రొటీన్‍తో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని స్మార్ట్‌ఫోన్ కు అమర్చిన ఒక పరికరంలో వేస్తారు. ఆ వెంటనే స్మార్ట్ ఫోన్ కెమెరాను మైక్రోస్కోపులా వాడి ఆ విశ్రమాన్ని స్కాన్ చేస్తారు. ఒకవేళ అందులో కరోనా సంబంధిత ఆర్‍ఎన్‍ఏ ఉంటే వెంటనే ఆ మిశ్రమం నుంచి కెమెరా కళ్లకు మాత్రమే కనిపించేంత అతిసూక్ష్మ కాంతి కిరణాలు వెలువడుతాయి. దీన్ని బట్టి టెస్టు చేయించుకున్న వ్యక్తికి పాజిటివా, నెగెటివా తేలిపోతుంది.