భారత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలను ఎగుమతి చేయలేదు : అధర్ పూనావాలా

దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీకాలు ఎన్నడూ ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అధర్ పూనావాలా స్పష్టం చేశారు. ఈ మేరకు అధర్ పూనావాలా ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో జనాభా ఎక్కువ కాబట్టి, వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి కాదని, కాస్త సమయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ఏడాది కోవిడ్ మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా గతంలో ఈ వ్యా్క్సిన్‌ను విదేశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండు దేశాల్లో భారత్ ఒకకటి అన్న విషయాన్ని అందరూ గ్రహించాలని పూనావాలా చురకలంటించారు. అంతటి పెద్ద దేశంలో రెండు, మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవడం అసంభవమని, అయ్యేపని కాదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ మహమ్మారి భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులకు పరిమితం కాలేదన్న విషయాన్ని కూడా గ్రహించాలని తేల్చి చెప్పారు. అమెరికా ఫార్మా కంపెనీల కంటే రెండు నెలల ఆలస్యంగా తమకు అనుమతులు వచ్చాయని, అయినా… సీరం ఇనిస్టిట్యూట్ 200 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను అందజేసిందని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు సదా సిద్ధంగానే ఉన్నామని, ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామన్నారు. కరోనాపై యుద్ధానికి అందరూ కలిసి రావాలని పూనావాలా విజ్ఞప్తి చేశారు.