గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా టీకా

భారతీయులందరికీ డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దేశంలో మరో వ్యాక్సిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. అమెరికాకు చెందిన మోడెర్నా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. ఈ వ్యాక్సిన్ దిగుమతి, అమ్మకాల కోసం మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీ సిప్లాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిని మంజూరు చేసింది.
మోడెర్నా వ్యాక్సిన్ దిగుమతికి అనుమతి కోరుతూ డీసీజీఐకి సిప్లా దరఖాస్తు చేసుకుంది. 90 శాతం సమర్ధతను కలిగి ఉన్న రెండు డోసుల మోడెర్నా ఎంఆర్‍ఎన్‍ఏ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోట్ల డోసులను ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మోడెర్నా వ్యాక్సిన్ భారత్‍లో అందుబాటులోకి వస్తోన్న నాలుగో కరోనా టీకా. ఈ టీకాకు అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు సంపన్న దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.