కోటి రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం 20,021 మందికి వైరస్ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871గా ఉంది. అలాగే అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,77,301(2.74 శాతం)కు తగ్గింది. అలాగే నిన్న ఒక్కరోజే 21,131 మంది వైరస్ నుంచి కోలుకోగా, గత నెల రోజులుగా పాజిటివ్ కేసులకంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 95.82 శాతానికి చేరింది.
ప్రస్తుతం దేశంలో కోలుకున్న వారి సంఖ్య 97,82,669గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 279 మంది ఈ వైరస్‌కు బలికాగా మొత్తం 1,47,901 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా వరుసగా మూడు రోజులుగా 300లోపే మరణాలు నమోదు కావడం ఊరటనిస్తోంది. కాగా, ఐసీఎంఆర్ వివరాల ప్రకారం.. ఆదివారం కేవలం 7,15,397 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 16,88,18,054 మంది నమూనాలను స్వీకరించారు.






