దేశంపై విరుచుకుపడుతోన్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో రెండోదశలో కరోనావైరస్ కనికరం లేకుండా కాటేస్తోంది. రికార్డు స్థాయిలో సంక్రమిస్తూ, వైద్య వ్యవస్థను కుప్పకూల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 17,53,569 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 3,46,786 మందికి కరోనా పాజిటివ్‍గా తేలింది. వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక మరణాలు కూడా భారీ స్థాయిలో ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. నిన్న 2,624 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటివరకు 1,89,544 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481కు చేరగా ఇప్పటి వరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 25,52,940 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్న 29,01,412 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 13,83,79,832 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.