జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం ?

దేశ ప్రజలకు వచ్చే నెలలో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. వచ్చే నెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్ వ్యాక్సిన్ షాట్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ భద్రత, సమర్థత తమ మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదన్నారు.
దేశంలో అత్యవసర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని డ్రగ్ రెగ్యులేటర్ విశ్లేషిస్తున్నారని చెప్పారు. అయితే వ్యాక్సిన్ పరిశోధనల విషయంలో భారత్ ఏ దేశానికి తీసిపోలేదన్నారు. టీకా సమర్థత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు స్వదేశీ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి టీకాలు వేసే సామర్థ్యం తమకుంటుందని చెప్పారు.