వ్యాక్సిన్ గ్యాప్ ల గందరగోళం!

కోవిడ్ సెకండ్ వేవ్‌తో దేశం చిగురుటాకులా వణుకుతోంది. కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేని పరిస్థితి నెలకొంది. దీంతో దేశ ప్రజలందరూ వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై గైడ్‌లైన్స్ మార్చుతుండడంతో జనంలో గందరగోళం పెరిగిపోతోంది.
కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాలంటూ కేంద్రానికి సిఫార్సు చేసింది ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం. కోవీషీల్డ్ రెండో డోసుల మధ్య ప్రస్తుతం 6 నుంచి 8 వారాల గ్యాప్ ఉండగా దాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచాలంటూ సూచన చేసింది. అదే విధంగా కరోనా నుంచి కోలుకున్న వారికి గతంలో 21 రోజుల తర్వాత వ్యాక్సిన్ ఇవ్వగా ఇప్పుడా వ్యవధిని 6 నెలలు పెంచాలంటూ పేర్కొంది. ప్రభుత్వం సైతం ఈ సూచనలు అమలు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే దేశంలో టీకాల కొరత వెంటాడుతోంది. టీకా కోసం వ్యాక్సినేషన్ సెంటర్‌కి వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు వైద్య సిబ్బంది. కేవలం రెండో డోసు టీకాలే అందిస్తున్నారు. ఆ సెకండ్ డోస్ టీకా ఎప్పుడు వేయాలనే దానిపై రోజుకో మాట చెబుతుండటం ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది.
రెండు వ్యాక్సిన్ల మధ్య వ్యవధి విషయంలో కచ్చితమైన విధానమంటూ లేకపోవడం విమర్శలకు, వివాదాలకు దారి తీస్తోంది. ఏ శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా వ్యవధిలో మార్పులు చేస్తున్నారో చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. డిమాండ్‌కి తగ్గ స్థాయిలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయలేకపోతుండడం వల్లే ఇప్పుడు డిమాండ్ తగ్గించేందుకు ఈ తరహా విధానాలు అవలంభిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్రం సూచనలకు తగ్గట్టుగా పని చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
జనవరి 16 నుంచి కేంద్రం వ్యాక్సినేషన్ మొదలు పెట్టింది కేంద్రం. తొలివిడతలో రెండు డోసుకి మధ్య వ్యవధి కేవలం 21 రోజులు ఉంటే చాలని చెప్పారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ఫ్రంట్‌లైన్ వారియర్లందరూ 21 నుంచి 28 రోజుల వ్యవధిలోనే రెండు డోసుల టీకా పొందారు. మార్చి, ఏప్రిల్ నెలలలో 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సమయలో కోవాగ్జిన్ డోసుల మధ్య గ్యాప్ 4 నుంచి 6 వారాలుగా, కోవీషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ని 6 నుంచి 8 వారాలుగా నిర్ణయించారు. ఇంతలో దేశంపై కోవిడ్ సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడింది. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద 18 ఏళ్లు పైబడిన వారికి మే 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తామంటూ ప్రకటించింది. దీంతో వ్యాక్సినేషన్‌కి డిమాండ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. అయితే ఆ స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు తయారు కావడం లేదు.