38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు

దేశంలో కరోనా కొత్త రకం (యూకేలో వెలుగుచూసిన రకం) వైరస్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 10, హైదరాబాద్‍లోని సీసీఎంబీలో 3, పుణెలోని ఎన్‍ఐవీలో 5, ఢిల్లీలోని ఐసీఐబీలో 11, ఎన్‍సీడీసీలో 8, కోల్‍కతాలోని ఒక ల్యాబ్‍లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైరస్ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్ రూం ఐసోలేషన్‍లో ఉంచినట్లు పేర్కొంది. పాజిటివ్ వ్యక్తుల తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. ఓవైపు దేశంలో కరోనా కేసులు నానాటికీ తగ్గుతున్న వేళ స్ట్రెయిన్ కేసులు కలవరపెడుతున్నాయి.
బ్రిటన్‍లో వెలుగుచూసిన ఈ కొత్తరకం వైరస్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. భారత్‍లోనూ ఈ రకం కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆంక్షల కంటే ముందే భారత్‍కు వచ్చిన యూకే ప్రయాణికులకు ఎయిర్‍పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించింది. వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‍గా తేలడంతో కొత్తరకం వైరస్ నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన 38 మందికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.