100రోజులు మాస్క్ లు ధరించండి – బైడెన్

అమెరికా ప్రజలంతా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరనున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అన్నారు. కరోనా కట్టడి విషయంలో తన మొదటి చర్య ఇదేనని, అంటూ, మాస్క్ ధరించడానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన పేర్కొన్నారు. మాస్క్ ధరించడం దేశ భక్తుల విధి అని ఆయన తన ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ‘‘అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయే జనవరి 20నే 100 రోజుల పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించమని దేశ ప్రజల్ని కోరతాను. ఎప్పటికీ ధరించమని చెప్పను. కేవలం 100 రోజులే. నాకు తెలిసి కొత్త కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గిపోతాయి’’ అని బైడెన్ సీఎన్‍ఎన్‍తో మాట్లాడుతూ అన్నారు.
కాగా అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గురువారం రాత్రి 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 2,10,000లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,41,24,678కి చేరింది. ఇక కొత్తగా 3,157 మంది మహమ్మారి బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 2,76,148కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్యా క్రమంగా ఎక్కువవుతోంది. నెల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.