కోవ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం : భారత్ బయోటెక్
కరోనా వ్యాధి నివారణకు ఉపకరించే వ్యాక్సిన్ తయారీ రంగంలో భారతదేశం కీలకమైన ముందడుగు వేసింది. ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్ సంస్థ ఇప్పటికే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో తొలి హ్యూమన్ ట్రయల్స్‌ను కూడా శుక్రవారం ప్రారంభించినట్టు సంస్థ అధికారికంగా వెల్లడించింది.
సంస్థ తయారు చేసిన కో వ్యాక్సిన్‌ను ముగ్గురు వ్యక్తులపై ఈ రోజు ప్రయోగించామని, ఆ ముగ్గురిపైనా అది ఎటువంటి విరుద్ధ ఫలితాలూ చూపలేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ చెప్పారు. రోహ్టక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ లో ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైనట్టు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలకు వినియోగించిన ముగ్గురూ దీన్ని విజయవంతంగా తట్టుకోగలిగారన్నారాయన. మరోవైపు ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబయి, పాట్నా నగరాల్లో కూడా ఈ హ్యూమన్ ట్రయల్స్‌కి ఆసుపత్రులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ట్రయల్స్ ప్రారంభించాయి కూడా. అయితే హర్యానా ఆసుపత్రిలో మాత్రమే తొలిసారి అధికారికంగా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ సమాచారం వెల్లడైంది.






