విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతి : భారత్ బయోటెక్

వివిధ రకాల ఒప్పందాల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్.. కొవాగ్జిన్‍ను ఎగుమతి చేయాలని భారత్ బయోటెక్ యోచిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో కొవాగ్జిన్‍ను ప్రవేశపెట్టడానికి యూఎస్‍కు చెందిన బయోఫార్మా కంపెనీ ఓక్యుజెన్‍తో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బయోటెక్.. ప్రస్తుతం దీన్ని విదేశాలకు సరపరా చేయడంపై దృష్టి పెట్టింది. పేద దేశాల్లో వ్యాక్సినేషన్‍ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పడిన గావి తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొవాగ్జిన్‍పై అమెరికాలో క్లినికల్ పరీక్షలను ఓక్యుజెన్ చేపడుతుంది. వ్యాక్సిన్‍ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ తరహా ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ విక్రయం, టెక్నాలజీ బదిలీకి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉన్న అవకాశాలను కూడా కంపెనీ పరిశీలిస్తోంది.
వ్యాక్సిన్ అభివృద్ధికి అయ్యే వ్యయాలను రాబట్టుకోవడానికి ఇతర దేశాలకు కూడా సరఫరా చేయడం కీలకమైందున భారత్‍లో వ్యాక్సిన్‍ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‍స్టిట్యూట్, వ్యాక్సిన్ ఎగుమతులపై దృష్టి పెడుతున్నాయి. వ్యాక్సిన్ అభివృద్ధి పక్రియంలో మూడో దశ క్లినికల్ పరీక్షలకు భారీగా నిధులను వెచ్చించాల్సి ఉంటుందని, రూ.150 కోట్ల వరకు ఖర్చవుతుందని హైదరాబాద్‍కు చెందిన పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. దేశీయంగా సరఫరాకు ప్రాధాన్యం ఇస్తూనే ఇతర దేశాలకు సరఫరా చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. రెండు దేశాలతో ప్రాథమిక సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇటీవల భారత్ బయోటెక్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వెల్లడించారు. ప్రస్తుతం కొవాగ్జిన్‍పై మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
2021 మధ్య నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వీలుంది. ప్రయోగాత్మకంగా ఎట్-రిస్క్ ప్రాతిపదికన ఇప్పటికే కంపెనీ దాదాపు కోటీ డోసులను తయారు చేసింది. కాగా కొవిషీల్డ్ వ్యాక్సిన్ సరఫరాకు బంగ్లాదేశ్, ఇతర ఆసియా దేశాలతో సీరమ్ ఇన్‍స్టిట్యూట్ చర్చలు జరుపుతోంది.