దేశంలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం

దేశంలో మ్యుకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు కలవరపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‍లో అత్యధికంగా 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఆంధప్రదేశ్ 768 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. అలాగే చికిత్స నిమిత్తం అదనంగా మరో 29,250 ఆంఫోటెరిసిన్-బి వయల్స్కు రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‍లో ఈ కేసులు సంఖ్య అధికంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ముప్పుగా పరిణమించింది. ఇదేమీ కొత్తవ్యాధి కాకపోయినా, దీని బారిన పడిన వారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరంలోని రక్షణ వ్యవస్థ ఈ ఫంగల్ వ్యాధిని తిప్పికొడుతుంది. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నావారు, క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారే దీని బారినపడే అవకాశం ఉంది.