TANA: 3.6 మిలియన్ డాలర్ల మోసం తరువాత తానా కర్తవ్యం ఏమిటి?
గత రెండువారాలుగా తానా సభ్యులే కాకుండా అమెరికాలోని తెలుగువారే కాకుండా, యావత్ ప్రపంచం నివ్వెరపోయిన 3.6 మిలియన్ డాలర్ల మోసం అందరూ మాట్లాడుకొంటున్నారు. టీవీ9, ఎబిఎన్, మహా టీవీ చానల్స్ తోపాటు అనేక యూట్యూబ్ వార్త చానెల్స్, గ్రేటర్ఆంధ్ర, తెలుగు టైమ్స్, టీఎన్ఐ లైవ్ లాంటి వార్త సంస్థలు ఈ విషయమై అనేక కథనాలు వినిపించాయి. ప్రచురించాయి. ఇవి కాకుండా అమెరికా తెలుగువారి అనేక వాట్సాప్ గ్రూప్లో వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. టీవీ9 లాంటి సంస్థలు ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రశ్నిస్తూ ఉంటామని కూడా హెచ్చరిస్తున్నాయి.
అంతేకాదు… శ్రీకాంత్ పోలవరపు తానా అత్యవసర బోర్డు సమావేశం 24 నవంబర్ 2024లో పాల్గొని తానే ఈ విధంగా తానా ఫౌండేషన్ లో నుంచి డబ్బులు బృహత్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశానని, డిసెంబర్ 15వ తేదీ లోపల తిరిగి కడతానని చెప్పడం మరుసటి దినం ఒక 1,00,000 డాలర్లు తానా అకౌంట్స్ కి పంపండం జరిగింది. ఒకవారం రోజుల్లో ఇంకో 1 మిలియన్ డాలర్లు కడతానని వాగ్దానం చేయడం కూడా జరిగింది. కానీ వారం కాదు 10 రోజులు అయినా ఆపని జరగ లేదు. సరికాదా శ్రీకాంత్ పోలవరపు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికీ తెలీదు. ఆయన దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిపోయి ఎవరికి అందుబాటులో లేడని అనుకొంటున్నారు.
ఈ విషయంలో తానా నాయకులు ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు పోలీస్ కంప్లైయింట్ ఇవ్వడం లేదు? అని అనేక మంది తానా సభ్యులు ప్రశ్నిస్తున్నారు కూడా. ఈ పరిస్థితులలో ఫెడరల్ గవర్నమెంట్ తెలుగు మరియు ఇతర సంఘాలు ఆపిల్, ఫేస్ బుక్ లాంటి అనేక కార్పొరేట్ సంస్థలలో మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో డబ్బులు రెట్టింపు చేసుకొన్న ఉదంతాలను తీవ్రంగా పరిగణిస్తోందని తెలుస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో శాంతాక్లారా కౌంటి డిస్ట్రిక్ట్ అటార్నీ ఆపిల్ సంస్థ నుంచి మోసం చేసిన ఉద్యోగస్తులను దోషులుగా పరిగణిస్తూ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
కాలిపోర్నియా వాస్తవులు భాస్కర్ మొలకలపల్లి ఈ విషయంపై మాట్లాడుతూ ఈ సమయంలోనైనా తానా సభ్యులు అందరూ ఒక మాట మీద తమ నిరసనలు తెలపాలి. తానా నాయకులు కూడా ఈ జరిగిన ఉదంతాన్ని పూర్తిగా పరిశీలించడమే కాకుండా ఇంతకు ముందు జరిగిన అవకతవకలను కూడా విచారించాలని అన్నారు. భాస్కర్ మొలకపల్లి లాంటి వ్యక్తులు, టీవీ ఛానల్స్, ఈ సమస్యను గట్టిగా ప్రస్తావిస్తున్నా 'పర్వాలేదు ! ఒకటి రెండు వారాలకు అందరూ మర్చిపోతారు' అనే అభిప్రాయం తానా నాయకులు పెట్టుకుంటున్నారని అందరూ అనుకుంటున్న విషయం మాత్రం నిజం.
ఒకసారి అమెరికాలో తెలుగు కమ్యూనిటీ మరియు తెలుగు సంఘాల పరిస్థితి విశ్లేషిద్దాం. గత 15 సంవత్సరాలలలో తెలుగు కమ్యూనిటీ బాగా పెరగడమే కాకుండా ఆర్థికంగా బాగా సంపాదించే స్థితికి చేరిపోయిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తానా, ఆటా, నాట్స్ లాంటి జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండేళ్ళకి ఒక్కసారి చేసే తెలుగు మహాసభలు 2010 కి ముందు ఒక మిలియన్ డాలర్ల అయితే, ఇప్పటి 3- 4 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతున్నాయి. ఇదివరకు తెలుగు రాష్ట్రాల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, బాంకులు స్పాన్సర్లుగా ఉండేవారు. ఇప్పుడు వారికి సమానంగా లేదా వారికంటే ఎక్కువగా అమెరికాలోని తెలుగువారు నడుపుతున్న బిజినెస్ సంస్థలు స్పాసర్ లు గా వస్తున్నాయి. అంటే ఆర్థికంగా తెలుగువారి అభివృద్ధి తెలుస్తోంది కదా. తానా లాంటి సంస్థ స్వచ్ఛందంగా గాని, సభ్యులద్వారా చేర్పించిన సభ్యతాలు ప్రేరేపితంగా గాని, స్పాన్సర్ల ద్వారా గాని సభ్యుల ను గణనీయంగా పెంచ గలిగారు. కేవలం 3 – 4 నెలలలో కొత్త సభ్యుల సంఖ్య 35000 చేరుకొందంటే తెలుగు వారి సంఖ్య – పరిస్థితి ఏమిటో తెలుస్తోంది. తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ చెప్పినట్లుగా ఒక సంవత్సరంలో దాదాపు 1100 మందిని పెట్రన్స్ గా 10000 డాలర్లు కట్టించి ఫౌండేషన్ కు 1.1 మిలియన్ డాలర్ల నిధిని సమకూర్చారు అంటే తెలుగువారి ఆర్థిక పరిస్థితి తెలుస్తోంది కదా!
అలాగే తానా నాయకత్వం ఇదివరలో (2000 కి ముందు, ఆ తారువాత కొన్ని సంవత్సరాలు) తానా నాయకులు అంటే 50 ఏళ్ల దాటినవారే. కానీ రాను రాను తానా కార్యవర్గం సభ్యుల వివరాలు పరిశీలిసే 30 ఏళ్ల 40 ఏళ్ళ వాళ్లు నాయకులుగా ముందుకు వస్తున్నారు. రావడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఉదాహరణ ఒక తానాకి మాత్రమే కాదు అమెరికాలో ఉన్న అన్ని పట్టణాల మరియు జాతీయ తెలుగు సంఘాలని వర్తిస్తుంది.
అలాగే ఇప్పడు తానా వచ్చిన సంక్షోభం నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్)లో కూడా గత 5 – 6 నెలలుగా జరుగుతున్నట్లు వార్తలు గట్టిగానే వస్తున్నాయి. నాటాలో కూడా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని, ఫెడలర్ బ్యూరో దృష్టికి వెళ్ళిందని దాంతో వారు బ్యాంక్ అకౌంట్ నిలిపివేవారని వార్తలు వింటున్నాము. పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీని, పెరుగుతున్న సేవా కార్యక్రమాలు చేయాలనే సభ్యుల దృక్పదాన్ని, పెరుగుతున్న విరాళాల వెల్లువను దృష్టిలో ఉంచుకొని తానా నాయకత్వం వెంటనే స్పందించాలని, ప్రస్తుత సంక్షోభానికి కారణమైన నిధుల మళ్ళింపు విషయంలో వెంటనే పోలీస్లకి చెప్పాలని అందరూ అనుకొంటున్నారు. అంతే కాదు ఇంతకు ముందు జరిగిన మోసాలు, నిధుల గల్లంతు లాంటి విషయాలపై తానా నాయకత్వం ఒక ప్రకటన ద్వారా సభ్యులకు వివరాలా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గ్రహించాలి.
ఒక్క కార్యవర్గ సభ్యుడు అన్నిసార్లు పెద్దఎత్తున నిధులు మళ్ళించ గలిగాడు అంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆ సమయంలో తానా నాయకత్వం రెండుగా చీలి, బేదాభిప్రాయాలతో, సమస్యలను కోర్టు వరకు తీసుకెళ్లడం వలన వచ్చిన అనిశ్చిత పరిస్థితి. రెండవ కారణం ఇంతక్రితం జరిగిన అవకతవకలు చేసినవారిపై తానా నాయకత్వం పెద్దగా చర్యలు తీసుకోక పోవడం, వన్ టైమ్ సెటిల్ మెంట్ లాంటి కాంప్రమైజ్ పద్ధతిలో సమస్య లను తాత్కాలికంగా ముగించటం వలన నిధులు మళ్ళించినా ఏమి పర్వాలేదు. అన్న నమ్మకం ఏర్పడటం. కాబట్టి తానా నాయకత్వం కేవలం ఒక సిగ్నేచర్ పేమెంట్ కాదు, ఇద్దరి సిగ్నేచర్స్ ఉండాలి లాంటి చర్యలు తీసుకోవడం తో పాటుతో నాయకుల మధ్య ఉన్న బేధాభ్రిపాయాలు పక్కన పెట్టి కఠినమైన చర్యలు తీసుకోనే విధంగా నియమ నిబంధనలను చేసుకొంటూ, తానా బైలాస్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని తెలుగు సంఘాలకు తానా తల్లి లాంటిది అని సగర్వంగా చెప్పకొనే నాయకులు ఇప్పుడు కూడా ముందుకు వచ్చి అన్ని తెలుగు సంఘాలకు మార్గదర్శకంగా ఉండే తానాను తయారు చేయాలని అనేక మంది సభ్యుల అభిప్రాయం.
తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లెపల్లి ఈ విషయం పై మాట్లాడుతూ తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర ప్రసాద్, తానా లీగల్ లైజన్ నరేన్ కొడాలి తానా అడ్వకేట్ తో సంప్రదింపులు చేస్తున్నారని, తానా అడ్వకేట్ కూడా FBI వారితో మాట్లాడుతున్నారని, త్వరలో సమగ్రం గా అన్ని విషయాలతో ప్రకటన వారి నుంచే వస్తుందని తెలిపారు.
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్ తెలుగుటైమ్స్







