ప్రజల సేవకే తానా ఫౌండేషన్ నిధుల వినియోగం – జయ్ తాళ్ళూరి, రవి సామినేని
తెలుగు రాష్ట్రాల ప్రజల సేవా కార్యక్రమాలకే తానా ఫౌండేషన్ నిధులను ఖర్చు చేస్తామని, తానా ద్వారా అందించే ఆదరణ కార్యక్రమాలకు గానూ ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తామని తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయ్ శంకర్, తానా ట్రస్టీ రవి సామినేని పేర్కొన్నారు. స్థానిక గాంధీక్షేత్రంలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాత యడ్లంక గ్రామ బాలికలు 25 మందికి సైకిళ్ళు పంపిణీ చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఆదరణ కార్యక్రమం ద్వారా కంటి, కాన్సర్ వైద్య పరీక్షలు, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, లాప్ టాప్ లు, సైకిళ్ళు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం 500 సైకిళ్ళు పేద విద్యార్థులకు అందించామన్నారు. ఇప్పటివరకు 13 లక్షల డాలర్లు పేద వర్గాల వారికి సద్వినియోగం చేశామని అంటూ ఎంతో అనుభవం కలిగిన మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ గారితో మాకు ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయని, సాహిత్య కార్యక్రమాల ద్వారా అమెరికాలోని తెలుగువారికి వారు ఎంతో దగ్గరైనారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో వేలమైళ్ళ దూరంలో తాము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మాతృభూమిని, మాతృదేశాన్ని మరిచిపోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తానా సేవలు అభినందనీయమని అన్నారు. కృష్ణానది గర్భంలో ఉన్న పాత యడ్లంక గ్రామంలోని విద్యార్థినులు నది దాటుకుని అవనిగడ్డ కు మూడు కిలోమీటర్ల దూరం నానా అవస్థలు పడి పాఠశాలకు వస్తున్నారని తెలుపగానే 25 మంది బాలికలకు సైకిళ్ళు అందించినందుకు తానా ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
తానా సాహిత్య వేదిక ను ఏర్పాటుచేసి కరోనా సమయంలో అంతర్జాలం ద్వారా కొన్ని వందలమందిని కలిపారని అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి తోడ్పడటమే కాకుండా, విపత్తుల వేళ భాదితులకు అండగా నిలుస్తున్నారన్నారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు ఆమోఘమని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా కాబోయే అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, నాయునిపాటి విశ్వనాధ్, చావా లక్ష్మీనారాయణ, అశోక్ కుమార్ భానోతు, వేమూరి శ్యామ్ గారు, పాత యడ్లంక గ్రామస్తులు విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తానా ఫౌండేషన్ సేవలను అందించినందుకు ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారిని , చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ గారిని పాత యడ్లంక గ్రామస్తులు అభినందించారు.













