TANA: పూర్తయిన ఎన్నికల ప్రక్రియ… పూర్వ వైభవాన్ని తెచ్చుకొనే దిశగా తానా ముందడుగు!
వేంకట సుబ్బారావు చెన్నూరి
ఎడిటర్ -తెలుగు టైమ్స్
ఎన్నికల ఫలితాలపై ఒక వర్గం కోర్టుకు వెళ్లడం, ఎన్నికైన అభ్యర్థులు తమ పదవులు చేపట్టటానికి ఒక సంవత్సరం ఆగాల్సి రావడం, ఆ సమయంలోనే గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా తానా ఫౌండేషన్ (TANA Foundation) లో జరిగిన ఫ్రాడ్ వలన వచ్చిన ఆర్ధిక సంక్షోభం లాంటి అంతర్గతంగా వచ్చిన ఒడిదుడుకులు తానా లాంటి 48 సంవత్సరాల, దాదాపు 90000 మంది సభ్యులు ఉన్న సంస్థ కార్యకలాపాలను అతలాకుతలం చేసాయనే చెప్పాలి. నాయకత్వానికి అగ్ని పరీక్ష పెట్టాయనే అనుకోవాలి. ఒక మంచి పని చేస్తే మెచ్చుకునే మీడియా, తప్పు జరిగితే ఎంత గట్టిగా ఎండగడుతుందో అందరూ చూశారు. నాయకులే కాదు..తానా సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా మాట పడ్డారు. బాధపడ్డారు.
డిసెంబర్ 2024 లో ఆర్థిక కుంభకోణం బయట పడే సమయానికి తానా ముందు రెండు పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి జులై 2025 లో డిట్రాయిట్ నగరం లో చేయాల్సిన 24 వ తానా కాన్ఫరెన్స్, రెండవది ఆ కాన్ఫరెన్స్ లోపల చేయాల్సిన ఎన్నికల ప్రక్రియ. దాదాపు సంస్థలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని స్థాయిల కార్యవర్గ సభ్యులు పాల్గొనాల్సిన ఈ రెండు కార్యక్రమాలు పెద్దవి. అందుకే తానా నాయకత్వం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలి అంటే ఈ రెండు కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి అని గట్టి నిర్ణయం తీసుకుని, వాటి ఆచరణకు సిద్ధం అయ్యింది.
డిట్రాయిట్ నగరం లో 3-5 జులై 2025 న జరిగే 24 వ తానా సభలకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో కార్యక్రమాలు తయారవుతున్నాయని, తానా సభలు విజయవంతంగా జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఇంకొక 10 రోజుల్లో జరిగే ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తోందని ఇప్పటికే జరిగిన రిజిస్ట్రేషన్స్, సభలను నిర్వహించటానికి వచ్చే విరాళాలే నిదర్శనం. అందుకు కాన్ఫరెన్స్ నాయకత్వానికి అభినందనలు చెప్పాలి.
ఇక తానా అగ్ర నాయకత్వానికి ముందున్న రెండవ సవాల్ .. ఎన్నికలు జరిపి, డిట్రాయిట్ కాన్ఫరెన్స్ లో పదవీ బాధ్యతలు తీసుకునే 2025-27 నాయకులను సిద్ధం చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో, ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో జరిగే ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా, పరోక్ష ఎన్నికల జరపాలని 15 ఏప్రిల్ 2025 న తానా బోర్డు నిర్ణయించిన సంగతి, ఈ ఎన్నికల ప్రక్రియ జరపడానికి పూర్తి స్థాయి ప్రమాణాలతో ఒక ప్రణాళికను, నిష్ణాతులైన ముగ్గురుతో ఎన్నికల కమిటీ ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే! ఆ ఎన్నికల ప్రణాళిక ప్రకారం 23 జూన్ 2025 తేదికి తానా లో ఉన్న పదవులకు వచ్చిన నామినేషన్స్, ఉపసంహరించుకోవడానికి ప్రకటించిన తేదీ తర్వాత ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులు జాబితా తయారయింది.
ఈ సందర్భంగా తానా ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ కనకం బాబు అయినంపూడి మాట్లాడుతూ ఎన్నికల ప్రణాళికలో నామినేషన్ తీసుకునే రోజు, ఉపసంహరించుకునే రోజు అయ్యాక ప్రకటించిన అన్ని పదవులకు అభ్యర్థులు ఉన్నారని, వాటిని పరిశీలించి మూడు రోజుల్లో ఎంపిక పూర్తి చేసి, తానా బోర్డు కి సమర్పించామని, తానా బోర్డు ఆమోదించిన తరువాత జూన్ 28 వ తేదీన విజేతల వివరాలు ప్రకటిస్తున్నామని తెలిపారు. శ్రీ కనకం బాబు అయినంపూడి వర్గాలకు అతీతంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న తానా సీనియర్ సభ్యులలో ఒకరు. తానా ఎన్నికల నిర్వహణ లో ఆయనకు మంచి అనుభవం ఉంది. వివాదరహితుడుగా పేరు ఉంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ కనకం బాబు ను చైర్మన్‌గా, శ్రీ రాజేష్ జంపాల, శ్రీ విజయ్ గుడిసెవ సభ్యులు గా ఉన్న ఎన్నికల కమిటీ సమర్ధవంతంగా ఈ ప్రక్రియ జరిపిందని తెలుస్తోంది.
తానా అగ్ర నాయకత్వం కూడా చాలా హోమ్ వర్క్ చేసిందనే చెప్పాలి. అదే విధంగా అన్ని నగరాల నుంచి ఎన్నిక అయ్యే సభ్యులు, సెంట్రల్ లీడర్షిప్ కి వచ్చే సభ్యులు కూడా తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు పక్కన పెట్టి, ప్రస్తుత సంక్షోభ సమయంలో కావలసిన బాధ్యత తో ఆలోచించి తమ నామినేషన్ లు వేశారు లేదా పోటీ నుంచి తప్పుకున్నారు అని కూడా తెలుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలి మరియు ఆచరించాలి అన్న ఆలోచన కంటే సంస్థ కు మంచి జరగాలి అన్న ఆలోచన తో ప్రవర్తించిన నాయకులందరికీ అభినందనలు. ఇంకొక నాలుగు రోజులలో ప్రకటించే అభ్యర్థుల వివరాలు కోసం ఎదురు చూద్దాం. ఎంతో బాధ్యత తో వస్తున్న ఈ కొత్త నాయకత్వం, మరింత బాధ్యత తో తానా ని ముందుకి తీసుకెళ్తుందని ఆశిద్దాం.
తానా ప్రాంతీయ ప్రతినిధులు
న్యూ ఇంగ్లాండ్ – మౌనిక మణికొండ
న్యూయార్క్ – శ్రీనివాస్ భర్తవరపు
న్యూజెర్సీ – సుధీర్ చంద్ నారెపాలెపు
మిడ్ అట్లాంటిక్ – ఫణి కుమార్ కంతేటి
క్యాపిటల్ ఏరియా – సుధీర్ నాయుడు కొమ్మి
అప్పలాచియన్ – రవి చంద్ర వడ్లమూడి
సౌత్ ఈస్ట్ – శేఖర్ కొల్లు
నార్త్ – రాంప్రసాద్ చిలుకూరి
ఒహియో వ్యాలీ – ప్రదీప్ కుమార్ చందనం
సౌత్ సెంట్రల్ – రవి కుమార్ పోట్ల
డిఎఫ్‌డబ్ల్యు – సతీష్ బాబు కోటపాటి
సౌత్ వెస్ట్ – మనోజ్ కుమార్ పాలడుగు
నార్త్ సెంట్రల్ – రామకృష్ణ వంకిన
సదరన్ కాలిఫోర్నియా – హేమకుమార్ గొట్టి
నార్తర్న్ కాలిఫోర్నియా – సుధీర్ ఉన్నం
నార్త్ వెస్ట్ – సుంకరి శ్రీరామ్







