Spiritual Foundation: విద్యార్థినికి ‘స్పిరిచువల్ ఫౌండేషన్’ లక్ష రూపాయల విద్యా పురస్కారం
మెమ్ఫిస్ : హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని జి. నాగలక్ష్మికి అమెరికాకు చెందిన ‘స్పిరిచువల్ ఫౌండేషన్’ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ప్రముక సంపాదకులు, రచయిత, మాస్టర్ సి.వి.వి యోగాశ్రమ వ్యవస్థాపకులు దివంగత శర్వరి, యామినీ దేవిల స్మృత్యర్థం ఈ సహాయాన్ని అందజేస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రమణ వాసిలి, చంద్రప్రభ వాసిలి తెలిపారు.
ప్రతిభకు పట్టాభిషేకం…
ప్రస్తుతం బి.సి.ఏ (BCA) రెండో సంవత్సరం చదువుతున్న నాగలక్ష్మి, ఇటీవల మదురై కామరాజ్ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘విశ్వర్షి వాసిలి సాహిత్యం’పై పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఈ పత్రం బెంగళూరు, మద్రాస్, మదురై విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ‘బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్’ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఆమె అసాధారణ ప్రతిభను గుర్తించిన ఫౌండేషన్, ఉన్నత చదువుల కోసం ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
తెలుగు విద్యార్థులకు బాసట…
తెలుగు రాష్ట్రాల్లోని పేద విద్యార్థులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఏటా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని స్పిరిచువల్ ఫౌండేషన్ తీర్మానించింది. 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ మొత్తాన్ని త్వరలోనే నాగలక్ష్మికి అందజేయనున్నట్లు డాక్టర్ రమణ తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు, నాగలక్ష్మి భవిష్యత్తులో ఆస్ట్రేలియా, యూరప్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేసేందుకు ఉన్న అవకాశాల గురించి చంద్రప్రభ వివరించారు. అక్కడ ఉన్న ఉపాధి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో కూడా ఆమెకు దిశానిర్దేశం చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు.






