విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించిన ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో శుక్రవారం నవంబర్ 5 నాడు కర్నూలు నగరానికి చెందిన ఐదుగురు విద్యార్థులు గాయత్రి, భావన, తేజశ్రీ, పల్లవి, జగన్ మోహన్ లకు 50,000 రూపాయల ఉపకారవేతనాలు అందించారు.
ఈ సందర్భంగా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి మాట్లాడుతూ గత మూడు నెలలలో వంద (100) మందికి పైగా విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలకు పైగా ఉపకారవేతనాలు అందించినట్లు తెలిపారు. స్వంత నిధులతో పాటు, చాలా మంది మిత్రులు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని పొట్లూరి రవి తెలిపారు. నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, ఫౌండేషన్ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణువర్ధన్ రెడ్డి, సందడి మధు, మీనాక్షినాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.













