డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు : మోదీ
మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్న భారత్ అమెరికా స్నేహబంధం మరింత బలపడుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మహమ్మారి కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఇలాంటి సమయాల్లో దేశాలన్నీ కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలి. కోవిడ్ 19ను తరిమికొట్టి ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. మీకు కృతజ్ఞతలు ట్రంప్. భారత్- అమెరికా మైత్రి మరింత బలోపేతం అవుతుంది అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.





