ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుంది : అమెరికా రాయబారి గార్సెట్టి
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన పర్యటన రెండు దేశాల సంబంధాల్లో సాహసోపేత సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అభివర్ణించారు. ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇది దశాబ్దాల దౌత్య కృషి ఫలితమని తెలిపారు. ఇది స్వచ్ఛమైన, లోతైన స్నేహబంధమని వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన చాలామంది అంచనాలను మించి విజయవంతమైందన్నారు. బైడెన్-మోదీ మధ్య స్నేహం, ఇరు దేశాల ప్రభుత్వాలు చేసిన కృషి, ప్రజలు, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల వల్ల ఇది సాధ్యమైంది. ఇదంతా భవిష్యత్తు కోసమే. రెండు దేశాలదే భవిష్యత్. రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉంటే మరింత సుసంపన్న ప్రపంచాన్ని సాధించేందుకు వీలవుతుంది అని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో శాంతి, సుసంపన్నత, ధరిత్రి, ప్రజలే కీలకాంశాలని వెల్లడిరచారు. అమెరికా వాణిజ్య విభేదాలను పక్కన పెట్టి ఎట్టకేలకు టెక్నాలజీ సహకారాన్ని, ప్రపంచ సరఫరా వ్యవస్థల అంశాలను, పర్యావరణం, అంతరిక్షం, నౌకాయానాల్లో కలిసి పనిచేసేలా సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు కొత్త కాన్సులేట్లను తెరవాలని నిర్ణయించామని తెలిపారు.













