తెలంగాణ సిఎం ఫండ్ కు నాటా 5 లక్షల విరాళం

తెలంగాణలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడేందుకు ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ముందుకు వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు నాటా తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.5 లక్షల సహాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, ప్రభుత్వానికి సహాయం చేయాలని నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమర్‍నాథ్ గుండా, సెక్రటరీ రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణ రెడ్డి కోరారు. కరోనాను కలిసికట్టుగా ఎదుర్కొందామన్నారు. ప్రపంచ మానవాళి కరోనా నుంచి వీలైనంత త్వరగా విముక్తి కావాలని వారు ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‍కుమార్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సూచనలతో నాటా సీఎంఆర్‍ఎఫ్‍కు తన వంతు సహాయాన్ని అందించిందన్నారు. అలాగే తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందించడానికి నాటా ఎల్లప్పుడు సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో నాటా రూ.10 లక్షల సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.