అన్నం సేవా ఫౌండేషన్ కి జయ్ తాళ్ళూరి విరాళం…సోలార్ పవర్ కేంద్రం ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో ‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి ఖమ్మం లోని స్థానిక అన్నం సేవా ఫౌండేషన్ కి తన మాతృమూర్తి తాళ్లూరి భారతిదేవి జ్ఞాపకార్ధం తాళ్లూరి పంచాక్షరయ్య ఛారిటబుల్ ట్రస్ట్ తరపున సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే సోలార్ పవర్ కేంద్రం ఏర్పాటుకు విరాళాన్ని అందించారు. దాంతో అన్నం సేవా ఫౌండేషన్ కి ప్రతి నెలా సుమారు 45 వేల రూపాయల విద్యుత్తు బిల్లు కట్టే వ్యయాన్ని జయ్ తాళ్ళూరి తగ్గించారు. అన్నం సేవా ఫౌండేషన్ వారు ఖమ్మంలో సుమారు 270 మంది మానసిక వికలాంగుల పూర్తి బాగోగులను చూస్తున్నారు. మానసిక వికలాంగులకోసం అన్నం సేవా ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు తనను కదిలించాయని, వారి సేవాకార్యక్రమాల్లో తనవంతుగా సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సోలార్ పవర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన అన్నం శ్రీనివాస్ మరియు టీంని అభినందించారు. ఈ సౌర శక్తి విద్యుత్ కేంద్రం ఏర్పాటులో సహకరించిన ‘తానా’ ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు వారి కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ ప్రాజెక్ట్ సఫలీకృతం అవడంలో తోడ్పడిన డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్‌కు చెందిన నాగేశ్వరరావు బండి, రంగారావు మరియు వారి టీంని అభినందించారు.













