అమెరికాకు బైబై.. ఎన్నారైల ఆలోచనల్లో మార్పు..!
అమెరికా డాలర్ డ్రీమ్స్.. డిగ్రీ చేతికొస్తే చాలు .. ఎలాగైనా అమెరికా వెళ్లిపోవాలి. అక్కడే స్థిరపడి, డాలర్ల పంట పండించుకోవాన్ని మొన్నటి వరకూ ఇదే సగటు భారతీయుడి కల. కానీ ఆకల కాస్త ముక్కలవుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో.. అమెరికాలో ఉండి ఏం ఉద్ధరిస్తాం.. క్షణక్షణం భయంభయం.. ఎందుకీ బతుకు అన్నట్లుగా తయారైంది ఎన్నారైల పరిస్థితి. దీంతో పదిమందిలో నలుగురు భారతీయ అమెరికన్లు.. అమెరికాను శాశ్వతంగా వీడి, ఇతరదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నారు.
అంతర్జాతీయ సంస్థ ‘కార్నెగీ ఎండోమెంట్’ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతీయ అమెరికన్ సమాజంలో రోజురోజుకీ ఆందోళన పెరుగుతోంది. ఎంతోమంది ఇప్పుడు అమెరికాను విడిచి వెళ్లాలనుకుంటున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల కారణంగా 40 శాతం మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.
ఇవి కూడా చదవండి
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన అనుసరిస్తున్న విధానాలు వలసదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో జీవన విధానాలు, ట్రంప్ ప్రభుత్వం తీరుపై యూగోవ్తో కలిసి కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
వివిధ కారణాల వల్ల, ప్రతి 10 మందిలో నలుగురు భారతీయులు అమెరికాను వీడాలనుకుంటున్నారు. రాజకీయ అస్థిరత కారణంగా తాము వెళ్లాలనుకుంటున్న వారు 58 శాతం మంది ఉన్నారు. జీవన వ్యయం కారణంగా 54 శాతం, వ్యక్తిగత భద్రత ఆందోళనతో 41 శాతం మంది అమెరికాను వీడాలని భావిస్తున్నారు. రెండోసారి ట్రంప్ పాలనపై తాము అసంతృప్తితో ఉన్నట్లు 71 శాతం మంది తెలిపారు. 2024-25 గణాంకాల ప్రకారం, అమెరికాలో 54 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. అమెరికాలో వీరి వాటా 1.5 శాతంగా ఉంది.
ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచే అమెరికాకు అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయని ఈ సర్వే తెలిపింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ వలసలు భారీగా తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధికంగా హెచ్1బీ వీసాలపై ఈ ప్రభావం కనిపించింది. గత సంవత్సరంలో ఈ వీసాల జారీ 25 శాతం మేర తగ్గిందని తెలిపింది. లక్ష డాలర్ల ఫీజు అమల్లోకి వచ్చాక వీసాల కోసం కంపెనీల నుంచి పిటిషన్లు 87 శాతం తగ్గుముఖం పట్టినట్లు ఈ సర్వే తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి








