ఎన్నారైల కష్టాలు..
ఊహ రాగానే అమెరికాకు ఎగిరిపోవాలి. డాలర్ డ్రీమ్స్ పండించుకోవాలి. ఇదే ఆలోచనతో ఏటా వేలాది మంది భారతీయులు అమెరికాకు వలసపోతున్నారు. అక్కడ ఉద్యోగాలు, చదువు, ఇతరత్రా వ్యాపకాలతో అగ్రరాజ్యం చేరుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ వారిలో చాలా మందికి గ్రీన్ కార్డు అందని ద్రాక్షలా మారుతోంది. దశాబ్దాల తరబడి అక్కడే ఉన్నప్పటికీ… చాలా మందికి గ్రీన్ కార్డు ఇప్పటికీ రాలేదు. దీంతో ఇప్పుడు పలు భారతీయ కుటుంబాలు.. పెను సవాల్ ఎదుర్కొంటున్నాయి.
H-4 వీసాతో చాలా మంది భారతీయులు అమెరికాలో నివాసం ఉంటున్నారు. దీని ప్రకారం పిల్లలకు 21 ఏళ్లు వచ్చేవరకూ వారు.. తల్లితండ్రులతో ఉండొచ్చు. కానీ 21 ఏళ్లు నిండిన మరుక్షణం.. వారి సొంతదేశానికి పోవాల్సి ఉంటుంది. పిల్లల విషయానికొస్తే పేరుకే భారత్ వారి సొంత దేశం.. కానీ వారికి ఊహ తెలిసినప్పటి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు.. దీంతో వారిని సొంత దేశానికి పంపలేక.. అమెరికా చట్టాల ప్రకారం అక్కడ ఉంచలేక భారతీయ కుటుంబాలు సతమతమవుతున్నాయి.
ప్రస్తుతం దాదాపు లక్షమంది భారతీయుల పిల్లలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. 21 యేళ్లు నిండడంతో.. వారు కుటుంబం నుంచి వేరుగా ఉండాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ వీసాతో గరిష్ట వయస్సు, గ్రీన్ కార్డు ప్రక్రియ దశాబ్దాలుగా పెండింగ్ ఉండడంతో.. అమెరికాలోని భారతీయులలో ఇది ఆందోళన కలిగిస్తోంది.
అమెరికాలో శాశ్వత నివాసం అందించే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం దాదాపు 10.7 లక్షల మంది భారతీయులు క్యూలో ఉన్నారు. ప్రతి దేశానికి 7 శాతం పరిమితి, పెండింగ్ కేసులు పరిగణనలోకి తీసుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 135 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. హెచ్-4 వీసా విధానంలో 21 ఏళ్లలోపు వ్యక్తులు USలో ఉండేందుకు అనుమతిస్తారు. గ్రీన్ కార్డు దరఖాస్తులు ప్రాసెస్ చేసే సమయానికి హెచ్-4 వీసా కింద ఉన్న 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు 21 యేళ్లు దాటిపోతారని కాటో ఇనిస్టిట్యూట్ లోని ఇమ్మిగ్రేషన్ స్టడీస్ నిపుణుడు డేవిడ్ జే బీర్ ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఇది వారి తల్లిదండ్రులనుంచి బలవంతంగా విడిపోవడానికి దారి తీస్తుంది.
బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 21 ఏళ్లు నిండిన నిర్దిష్ట H-4 వీసా హోల్డర్లను అమెరికాలో ఉండటానికి, పని చేయడానికి అనుమతించే ఒక నియమాన్ని ప్రతిపాదించింది. అయితే ఈ నియమం ఎప్పుడు అమలు చేయబడుతుందో అస్పష్టంగా ఉంది. గ్రీన్ కార్డ్‌ల కోసం 7 శాతం కంట్రీ క్యాప్‌ను మారుస్తానని కూడా బిడెన్ హామీ ఇచ్చారు.













