భారతీయులకు గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డు నిబంధనలు సడలించిన బైడెన్ సర్కారు!
భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు అగ్రరాజ్యానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పర్యటనకు కొన్ని రోజుల ముందే అక్కడి భారతీయులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఐటీ ఉద్యోగులు, భారతీయులకు మరింత సులభంగా ఈ కార్డు లభించేలా చర్యలు చేపట్టింది. గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను బైడెన్ ప్రభుత్వం సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వలస వచ్చిన వారికి శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు తప్పనిసరి అని తెలిసిందే. వలసల చట్టం ప్రకారం ఏటా సుమారు 1.4 లక్షల గ్రీన్‌కార్డులను అమెరికా జారీ చేస్తూ వస్తోంది. వీటిలో ఒక్కో దేశానికి లభించే గ్రీన్ కార్డులపై 7 శాతం క్యాప్ ఉంది. ఇప్పుడు ఈ నిబంధనలు సడలించడంతో భారతీయులకు వేగంగా గ్రీన్ కార్డులు లభించే అవకాశం ఉంది.













