భారతీయ విద్యార్థులకు బంపరాఫర్.. భారీగా వీసాలు జారీచేస్తున్న అగ్రరాజ్యం!
అగ్రరాజ్యం అమెరికా నుంచి స్టూడెంట్ వీసాలు అందుకున్న వారిలో అత్యధిక భాగం భారతీయులేనట. ఈ విషయాన్ని యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గ్రాసెటి వెల్లడించారు. యూఎస్ మిషన్ ఇన్ ఇండియా ఏడో వార్షిక ‘స్టూడెంట్ వీసా డే’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబైల్లో ఉన్న కాన్సులర్లు 3,500 మంది భారత విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎరిక్.. ‘ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటి కన్నా భారతీయ విద్యార్థులకే అమెరికాకు ఎక్కువగా వస్తారు. అంతేకాదు, వాళ్లే అన్ని రంగాల్లో మేటిగా రాణిస్తున్నారు కూడా. అంతెందుకు 2022లో అమెరికా జారీ చేసిన ప్రతి ఐదు స్టూడెంట్ వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కింది. ఇక్కడితో ఆగకుండా భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసాలు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.
ఈ ఏడాది భారతీయ విద్యార్థులకు మరిన్ని వీసా అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉంచుతామని ఎరిక్ హామీ ఇచ్చారు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి వేలాది స్టూడెంట్ వీసా అప్లికేషన్లను విడుదల చేస్తాం అని ఆయన ప్రకటించారు. ఎంబసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియా నుంచి ఏకంగా 1.25 లక్షల మంది విద్యార్థులకు స్టూడెంట్ వీసాలు అందాయి. అలాగే 2022లో అమెరికా జారీ చేసిన హెచ్&ఎల్ ఎంప్లాయిమెంట్ వీసాల్లో 65 శాతం, ఎఫ్1 స్టూడెంట్ వీసాల్లో 17.5 శాతం భారతీయులే దక్కించుకున్నారు.













