హైదరాబాద్‌లో చబ్ ఇన్సూరెన్స్ టెక్నాలజీ కేంద్రం
స్థిరాస్తి, క్వాజువాలిటీ బీమా సేవలు అందించే అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థ చబ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్‌లో తన సాంకేతిక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసిది. మరో కేంద్రాన్ని బెంగళూరులోనూ ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా చబ్ ఇన్సూరెన్స్‌కు అవసరమైన సాంకేతిక, డిజిటల్, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, రిస్క్ మేనేజ్మెంట్ అంశాల్లో ఈ 2 కేంద్రాలు సహాయం చేయనున్నాయి. హైదరాబాద్‌లో ప్రాథమికంగా 100 మందికి పైగా ఉద్యోగులను తీసుకున్నట్లు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చబ్ ఇన్సూరెన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిన్ రింగ్స్టెడ్ తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లోని టెట్రాసాఫ్ట్తో కలిసి పనిచేసిన ఈ సంస్థ అందులోని నిపుణులను తన పూర్తిస్థాయి
ఉద్యోగులుగా తీసుకుంది. గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ జూలీ దిల్మాన్ మాట్లాడుతూ భారత్ నుంచి సాంకేతిక నిపుణులు అందించే సహకారం సంస్థకు ఎంతో కీలకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ ఫిన్‌టెక్ సంస్థల కోసం ఒక ప్రత్యేక ఫోరం ఈ నెల 17న ప్రారంభం కాబోతోందని వెల్లడించారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు పలు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు సంస్థలు దాదాపు 300లకు పైగా ఇప్పటికే ఇందులో నమోదైనట్లు తెలిపారు.













