అమెరికాలో కలకలం.. క్యాపిటల్ భవనాలకు
అగ్రరాజ్యం అమెరికాలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. ఇరాన్లో భీకర పేలుళ్ల వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జార్జియా, కనెక్టికట్, కెంటకీ, మిషిగన్, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్, హవాయి రాష్ట్రాల క్యాపిటల్ భవనాలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఈ మెయిల్ ఐడీ నుంచి ఒకేసారి అన్నీ ఆఫీసులకు ఈ సందేశాలు చేరినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వెంటనే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. అవి నకిలీ బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తెలిపింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.













