వీధి అరుగు వేదికపై ఏప్రిల్ 25న అన్నమయ్య సంకీర్తనలు-సామాజిక ధృక్పథం కార్యక్రమం
నాలుగు తెలుగుమాటలు చెప్పుకునేందుకు వీధి అరుగు వేదికగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది తెలుగు భాషాభిమానులు వీధి అరుగు పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాల వేదికపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25వ తేదీన అన్నమయ్య సంకీర్తనలు – సామాజిక ధృక్పథంపై ఓ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు, సంఘసేవకులు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి పాల్గొంటున్నారు. గాయని శ్రీమతి శివాని సరస్వతుల పాట పాడనున్నారు.
తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనల రాయబారి, మానవసేవే మాధవసేవ అని నమ్మి సమాజసేవ చేస్తున్న సంఘసేవకురాలు, సంగీత ప్రపంచములో తనకంటూ ఒక విలక్షణ స్థానాన్ని, గుర్తింఫును తెచ్చుకున్న ఆధ్యాత్మికతత్వవిధురాలు, దీపశిఖాసమానులు, ‘అమ్మ జ్యోతిర్మయి/గురు జ్యోతిర్మయి’ గా ప్రసిద్ధిగాంచిన శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి ఈ ఏప్రిల్ మాసాంతపు వీధి అరుగు యొక్క విశిష్ట అతిథి. అన్నమాచార్య సంకీర్తనల ద్వారా సమాజంలో మార్పు, చైతన్యం ఎలా తీసుకురావచ్చు? ఆధ్యాత్మిక భావనల ద్వారా ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు? సమకాలీన సామాజికాంశాలపై పోరాటంచేయటానికి గురు జ్యోతిర్మయి గారు ఎంచుకున్న సాధనాలేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వీధి అరుగు మీ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. ఇతర వివరాలకు ఫ్లయర్ చూడండి.













