తెలుగు ప్రేక్షకులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు… టీటీఏ ఈవెంట్లో శ్రీవిష్ణు కామెంట్స్
చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026 లో హీరో శ్రీవిష్ణు ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులతో ఉన్న తన ప్రత్యేక బంధాన్ని పంచుకున్నారు.
శ్రీవిష్ణు ప్రసంగం సాగిందిలా..
టీటీఏ కన్వెన్షన్‌ను ఇంత అద్భుతంగా నిర్వహించిన టీమ్ అందరికీ, ముఖ్యంగా ప్రవీణ్, నవీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీని ఒకచోట చేర్చడంలో వారు చేసిన కృషిని ప్రశంసించారు. తన కెరీర్ ఆరంభం నుండే విభిన్నమైన , ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకున్నప్పుడు, వాటిని ఆదరించిన మొదటి ప్రేక్షకులు అమెరికాలోని తెలుగువారేనని శ్రీవిష్ణు గుర్తుచేసుకున్నారు.
అమెరికా పర్యటనల్లో అభిమానులు తనకు చూపిస్తున్న ఆదరణను ఆయన గుర్తు చేసుకున్నారు. విదేశాల్లో ఉంటున్నా తమ పిల్లలకు తెలుగు భాషను, అలాగే భారతీయ శాస్త్రీయ కళలను, సంగీతాన్ని, తెలంగాణ జానపద పాటలను నేర్పిస్తూ, వారిని మూలాలతో అనుసంధానం చేస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు.
శ్రీ విష్ణు కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ కు సంబంధించిన పాటను ప్రొడ్యూసర్ దిల్ రాజు, డా. ఏవీ గురువా రెడ్డి కలిసి ఈ వేదికపై లాంచ్ చేశారు. తన చిత్రాలను ఇలాగే ప్రేక్షకులు ఆదరిస్తే, భవిష్యత్తులో సినిమా లాంచ్ కార్యక్రమాల కోసం కచ్చితంగా అమెరికాకు వస్తానని హామీ ఇచ్చారు.








