USA: అమెరికాలో మిన్నంటిన సేవా స్ఫూర్తి.. ఘనంగా సంగీత విభావరి
చికాగో: భారతీయ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలోని నిరుపేద రోగులకు ఉచిత కంటి వైద్యం అందించడమే లక్ష్యంగా, శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ నిర్వహించిన సాంస్కృతిక వేడుక విజయవంతమైంది. 2025 డిసెంబర్ 13న అరోరా ప్రాంతంలో నిర్వహించిన ఈ చలనచిత్ర సంగీత కచేరీ సమాజంలో కంటి సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు, భారీగా విరాళాలను సేకరించడంలో సఫలీకృతమైంది.
ఉర్రూతలూగించిన సినీ సంగీత విభావరి
కార్యక్రమంలో భాగంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, చలనచిత్ర నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. చికాగోకు చెందిన గాయకులు ప్రవీణ్ కుమార్ జాలిగమ, మణి తెల్లాప్రగడ, పరిమళా ప్రసాద్ తమ గానంతో సభను ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సినీ నేపథ్య గాయకులు పార్థు, మల్లికార్జున్, సుమంగళి తమ అద్భుత ప్రదర్శనతో హోరెత్తించారు. మల్లికార్జున్ తన గాత్రంతో పాటు నృత్యంతోనూ ఆకట్టుకోగా, పార్థు పాడిన ‘వేదం.. అణువణువునా నాదం’ గీతం సభను సమ్మోహితులను చేసి గ్రాండ్ ఫినాలేగా నిలిచింది. కఠినమైన చలిని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన ప్రేక్షకులు సమయం మర్చిపోయి ఈ వేడుకలో మునిగిపోయారు. ప్రణతీ, హరీషాల వ్యాఖ్యానం కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.
సేవపై అవగాహన – ప్రముఖుల ప్రసంగాలు
చికాగో చాప్టర్ ట్రస్టీలు పవన్ నారం రెడ్డి, గౌరి అద్దంకి మాట్లాడుతూ సాధారణ కంటి పరీక్షల నుండి అధునాతన శస్త్రచికిత్సల వరకు శంకర నేత్రాలయ అందిస్తున్న సేవలను వివరించారు. శంకర నేత్రాలయ USA ప్రెసిడెంట్ బాల రెడ్డి ఇందుర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి, బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్ రెడ్డి కటంరెడ్డి భారతదేశం అంతటా సంస్థ చేస్తున్న పరివర్తనాత్మక పనులను హైలైట్ చేశారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ ప్రతినిధి శ్రీమతి లిమా మ్యాతీవ్, అరోరా కౌన్సిల్ మెంబర్ శ్వేతా బైద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
వెల్లువెత్తిన దాతృత్వం
NRI సమాజం తమ జన్మభూమి పట్ల ఉన్న బాధ్యతను చాటుకుంటూ భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా మూడు మొబైల్ సర్జికల్ యూనిట్ల (MSU) ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూరాయి. దీని ద్వారా కనీసం మూడు గ్రామాల ప్రజలకు ప్రత్యక్షంగా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా అంధత్వ నివారణ కోసం గ్రామాలను దత్తత తీసుకున్న (Adopt a Village) రవి వీరపనేని, శివ గాడెపల్లి, పద్మారావు & సునీతలను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

విజయవంతం చేసిన బృందం
చికాగో చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ హిమ, ట్రస్టీల నాయకత్వంలో శ్రీహరి జాస్తి, కిరణ్ మాట్టే, మోహన్ పరుచూరి, రాధికా గరిమెళ్ళ, తమిశ్రా కొంచాడ, రామ్ ప్రసాద్, మాలతీ దామరాజు, శ్వేతా కొత్తపల్లి, బిందు, రాధా వీరపనేని, శైలజ సప్ప, శివ, రామకృష్ణ తాడేపల్లి, నరేశ్ తదితర బృందం ఈ వేడుకను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నివారించగల అంధత్వాన్ని తొలగించాలనే సదాశయంతో శంకర నేత్రాలయ చేస్తున్న కృషికి తమ వంతు మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికీ సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
మరింత సమాచారం కోసం www.sankaranethralaya.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.






