WAR 2 Review: యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ ‘వార్ 2’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : యశ్ రాజ్ ఫిల్మ్స్
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు
సినిమాటోగ్రఫి: బెంజమిన్ జాస్పర్, ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
సంగీతం (బీజీఎం) : ప్రీతమ్, సంగీతం (పాటలు) : సంచిత్, అంకిత్ బల్హారా
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్, కథ, మాటలు : అబ్బాస్ టైర్‌వాలా
నిర్మాత: ఆదిత్య చోప్రా, దర్శకత్వం: ఆయన్ ముఖర్జీ
విడుదల తేది : 14.08.2025
నిడివి : 2 ఘంటల 53 నిముషాలు
ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు నా అభిమానులు కాలర్ ఎత్తుకునే సినిమాలే చేస్తాను అని మాటిచ్చారు నాడు . అన్నట్టుగానే ‘దేవర’ సినిమాతో ఆ మాటను నిలబెట్టుకున్నారు కూడా. ఇటివల జరిగిన ‘వార్ 2’ (War2) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక్క కాలర్ కాదు.. ఏకంగా రెండు కాలర్లు ఎత్తారు. ఈసారి రెండూ ఎత్తాను. ఏం పర్లేదు.. ఎవరెన్ని మాట్లాడుకున్నా.. బొమ్మ అద్దిరిపోయింది. పండగచేసుకోండి’ అంటూ రెండు కాలర్లూ ఎత్తిమరీ బొమ్మ బ్లాక్ బస్టర్ కాబోతుందని వార్ 2పై బజ్ వువ్వేతున హైప్ క్రియేట్ చేసారు ఎన్టీఆర్. ఇద్దరు సూపర్‌స్టార్లు (ఎన్టీఆర్-హృతిక్ రోషన్)లను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు? ఈ సినిమా ఎలా ఉంది? వార్ 2 కథేంటీ? ప్రేక్షకులను వార్ 2 మెప్పించిందా? లేదా? ఓ పక్క ఒకే డేట్ లో.. మరో పక్క చూస్తే. విడుదల అయిన ‘కూలీ’ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నా ‘వార్ 2’ అస్సలు వెనక్కి తగ్గలేదు. రెండు ప్యాన్ ఇండియా బడా బడ్జెట్ మూవీస్ మధ్య బాక్సాఫీస్ వార్ ఇంట్రస్టింగ్‌గా మారడంతో మరి ‘వార్ 2’ బాక్సాఫీస్ వార్‌లో కూలీ కి ఎదురు నిలబడిందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ :
మాజీ రా ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) వరుసపెట్టి బడా బాబులను హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకునే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ని కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం రా, భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి (జూనియర్ ఎన్టీఆర్) నాయకత్వం వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్‌పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) పగతో రగిలిపోతుంది. తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజం తెలుసుకుంటాడు. రా ఏజెంట్‌గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? సునీల్ లూథ్రాను ఎందుకు చంపాడు? కబీర్‌కు కావ్యకు ఉన్న సంబంధం ఏంటీ? ఒకప్పుడు తనకి గాడ్ ఫాదర్‌గా ఉన్న లూథ్రాని కబీర్ ఎందుకు చంపాడు? సోల్జర్‌గా దేశం కోసం ప్రాణంపెట్టే కబీర్.. దోశద్రోహిగా ఎందుకు మారాడు? శత్రుదేశాలతో ఎందుకు చేతులు కలిపాడు? తనని పట్టుకోవడానికి వచ్చి మేజర్ విక్రమ్ కోసం.. కబీర్ తెలుసుకున్న నిజాలేంటి? అసలు వీళ్లిద్దరిలో ఎవరు సోల్జర్? ఎవరు దేశద్రోహి? అసలు ఆ అజ్ఞానశక్తి కలి ఎవరు? ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కబూ-రఘలకు కబీర్-విక్రమ్‌లకు లింకేంటి? కలి గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది? అనేది వార్ 2 కథ.
నటీనటుల హవబవాలు :
ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. సిక్స్ ప్యాక్‌లో యుద్ధ విమానానికి వేలాడుతూ ఓ రేంజ్ ఎలివేషన్స్‌తో ఎంట్రీ ఇస్తాడు ఎన్టీఆర్. కథానాయకులకు ప్రాధాన్యత కల్పించే విషయంలో అటు హృతిక్.. ఇటు ఎన్టీఆర్ ఎవర్నీ తక్కువ కాదు. కాబట్టే ‘వార్ 2’లో వాడెక్కువా.. వీడు తక్కువా అని వెతుక్కునే వాళ్లకి తప్పితే.. ఆ హెచ్చుతగ్గులు ఎక్కడా కనిపించవు. యుద్ధభూమిలో ఇద్దరు పోరాట యోధుల ‘వార్’ మాత్రమే కనిపిస్తుంది. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా అడ్రస్ గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్లాడు. ఫస్టాఫ్‌లో రా నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్‌లో ఫ్లైట్ మీద జరిగే యాక్షన్ సీన్‌లలో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను గుర్తుచేశాడు. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే.. హృతిక్‌కు గట్టిపోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. వార్ 2 మొదలైనప్పటి నుంచి హృతిక్‌తో పోల్చుతూ.. చిన్నా, పెద్దా, పొడుగు, పొట్టి, తెలుపు, నలుపు అంటూ ఇలా పనికిమాలిన వ్యత్యాసాలన్నీ తీసుకుని వచ్చి ఎన్టీఆర్‌ని డీఫేమ్ చేసే ప్రయత్నాలను జరిగాయి. వాటన్నింటినీ వార్ 2తో పటాపంచలు చేశాడు ఎన్టీఆర్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్‌తో పనేం ఉంది అన్నట్టుగా తన పెర్ఫామెన్స్‌తోనే సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో ఏడిపించేశాడు. హీరోయిన్ కియారా అద్వానీ బికినీ, రా ఏంజెంట్‌గా మంచి పాత్రే పడింది. కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా.. లిప్‌లాక్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ తనలోని మరో షేడ్‌ను చూపించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ చిత్రంలోని విజువల్స్ మాత్రం అద్దిరిపోయాయి. విజువలైజేషన్‌తో ప్రపంచ దేశాలన్నీ మనం ఫ్రీగా చూసినట్టే అనిపిస్తాయి బెంజమిన్ జాస్ఫర్ సినిమాటోగ్రఫీతో యాక్షన్ వార్ చూపించారు. ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార త్రయం అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఉన్న ఒకటి రెండు పాటలు తెలుగు వాళ్లకి ఎక్కవు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చినప్పుడు.. సైతాన్.. సైతాన్ అంటూ వచ్చే ఆర్ఆర్ హైలైట్‌గా నిలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలను బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు.. పైగా ఈ సోషల్ మీడియా వార్‌లో ‘వార్ 2’ హీరోలను బ్యాలెన్స్ చేయడం ఇంకా కష్టం. కానీ.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇద్దరు స్టార్ హీరోలను యుద్ద వీరులుగా చూపించారు. నిజానికి కథలో కథానాయకుల హెచ్చుతగ్గుల గురించి ఆలోచించాడంటే ఆ దర్శకుడు కథకి న్యాయం చేయలేదని అర్థం. ఈ విషయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ కథకే ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే కథానాయకులకు కాదు. ఈ సినిమాలో రన్నింగ్ ట్రైన్‌పై కారేసుకుని దూకేస్తారు హీరోలు. అంతేనా? గాల్లో.. ఆకాశంలో.. నీటిలో ఇలా కాదేది యాక్షన్ సీన్లకు అనర్హం అన్నట్టుగా ఇద్దరు హీరోలు విజృంభించేశారు. గాల్లో ఎగురుగుతున్నయుద్ధవిమానలపైకి ఎక్కి నేలమీద పాకినట్టే తెగ పాకేసి.. తెగ ఫైట్లు చేసేశారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లను మించిన విన్యాసాలు చాలానే కనిపిస్తాయి. యాక్షన్ ఘట్టాలు ఉత్కంఠ కలిగించేవిగా.. భారీగా సి జి వర్క్ అధ్బుతంగా చేసారు. యష్ రాజ్ ఫిల్మ్స్ క్వాలిటీ విషయంలోనూ కానీ.. ఖర్చు విషయంలో కానీ వెనక్కి తగ్గరని క్వాలిటీ విజువల్స్‌తో మరోసారి నిరూపించారు.
విశ్లేషణ :
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్ కి వార్ 2 కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నీకల్ వాల్యూస్ తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి. అలాగే సినిమాలో పలు ట్విస్ట్ లు గాని టర్నింగ్ లు గాని మంచి సర్ప్రైజ్ చేస్తాయి. వీటితో పాటుగా అక్కడక్కడా మంచి ఎమోషనల్ సీన్ లు కూడా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘వార్ 2’ ఇరు హీరోల లవర్స్ కి యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ అని చెప్పవచ్చు. కొంచెం కంటెంట్ పైన కూడా మరికాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది. లాజిక్‌లు మ్యాజిక్‌లను పక్కనపెడితే.. పెద్దగా సంబంధం లేకుండా ఇరు హీరోల హోరాహోరీ వార్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చూడాలి అనుకునేవారికి వార్ 2 బాగా నచ్చుతుంది.