Thug Life Review: పాత చింతకాయ పచ్చడి లాంటి ‘థగ్ లైఫ్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
నటి నటులు :కమల్ హాసన్, సింబు, త్రిషా కృష్ణన్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్,
పంకజ్ త్రిపాఠి, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సాన్యా మల్హోత్రా తదితరులు
బ్యానర్లు: రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
సంగీతం: ఏఆర్ రెహమాన్, సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
యాక్షన్: అన్బరివ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
తెలుగు రిలీజ్: శ్రేష్ఠ్ మూవీస్ (ఎన్ సుధాకర్ రెడ్డి)
సమర్పణ: ఉదయనిధి స్టాలిన్ (రెడ్ జైయింట్ మూవీస్)
నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ ఆనంద్
రచన, దర్శకత్వం: మణిరత్నం
విడుదల తేది : 05.06.2025
నిడివి : 2 ఘంటల 45 నిముషాలు
ఇండియన్ సినిమాలో రెండు పవర్ హౌసెస్ ఉలగనాయగన్ కమల్ హాసన్(Kamal Haasan), విజనరీ డైరెక్టర్ మణిరత్నం (Maniratnam) మూడున్నర దశాబ్దాల తరువాత ఈ సినిమాతో మళ్లీ కలసి రావడం విశేషం. వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండరీ మూవీ నాయకుడు భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అందుకే ‘థగ్ లైఫ్’ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మాఫియా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ తో నిండిన కథనాన్ని ‘థగ్ లైఫ్’ ఈ రోజు థియేటర్ లలో విడుదల అయ్యింది. మరి ఇలాంటి కథతో మణిరత్నం ఎలాంటి మ్యాజిక్ చేస్తారు? మళ్లీ కమల్ హసన్ తో తన సత్తాను చాటుకుంటారా? అన్నది
సమీక్షలో చూద్దాం!
కథ:
రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్)(Kamal Hasan) తన అన్న మాణిక్యం (నాజర్) (Nazar)తో కలిసి ఓ గ్యాంగ్‌ను మెయింటైన్ చేస్తాడు. సదానందం (మహేష్ మంజ్రేకర్) (Mahesh Manjrekar)ఓ సారి శక్తిరాజు అండ్ గ్యాంగ్‌ను అంతం చేయాలని పోలీసులకు ఇన్ ఫర్మేషన్ ఇస్తాడు. ఆ టైంలో అక్కడికి పేపర్ వేయడానికి ఓ ఫ్యామిలీ వస్తుంది. తండ్రి, కొడుకు, కూతురు ఇలా ముగ్గురూ ఆ ఏరియాలో పేపర్ వేస్తుంటారు. ఇక పోలీసుల రాకను గమనించిన శక్తిరాజు గ్యాంగ్ ఎదురు దాడి చేస్తుంది. ఆ దాడిలో ఆ తండ్రి చనిపోతాడు.. దీంతో అతడి కొడుకు అమర్(శింబు)(Simbhu)ను తన కవచంగా మార్చుకుంటాడు శక్తిరాజు. ఆ గొడవల్లో తప్పిపోయిన తన చెల్లి చంద్ర కోసం అమర్ వెతుకుతాడు. కానీ అమర్‌కి చంద్ర కనిపించదు. అయితే చంద్రను వెతికి పెట్టిస్తానని తనకు నీడగా, తనకు ప్రతిబింబంగా అమర్‌ని పెంచుకుంటాడు శక్తిరాజు. పెరిగి పెద్దైన తరువాత శక్తిరాజుకి కుడిభుజంగా మారుతాడు అమర్. సదానందం మేనల్లుడు రాను అనే వ్యక్తితో గొడవ, అతడ్ని చంపిన కేసులో భాగంగా శక్తిరాజు జైలుకు వెళ్తాడు. అప్పుడు పవర్ అంతా కూడా అమర్ చేతికి ఇచ్చి వెళ్తాడు. దీంతో మాణిక్యం తనకు అధికారం దక్కడం లేదని అసంతృప్తితో ఉంటాడు.
శక్తిరాజు బయటకు వచ్చే సరికి చాలా మందిలో మార్పులు వచ్చేస్తాయి. తన తమ్ముడు రానుని చంపిన పగతో రగిలిపోయే దీపక్ (అలీ ఫజల్) (Ali Fazal)శక్తిరాజు తన మీద దాడి చేయిస్తాడు. ఈ దాడి వెనుక అమర్ ఉన్నాడని శక్తిరాజు అనుమానించేస్తాడు. ఇంత నమ్మకంగా ఉంటే తననే అనుమానిస్తాడా? అని అమర్ బాధపడుతుంటాడు. అలా ఓ సారి సమయం చూసి అమర్‌ను మాటలతో ఏమార్చేసి శక్తిరాజుని చంపాడానికి ప్లాన్ చేస్తాడు మాణిక్యం. అలా అమర్, మాణిక్యం, పాత్రోస్ (జోజు జార్జ్)(Jozu George) కలిసి శక్తిరాజు మీద హత్యాయత్నం చేస్తారు. అంతా చనిపోయాడని అనుకుంటున్న శక్తిరాజు.. ఆ తరువాత మళ్లీ ఎలా తిరిగి వస్తాడు?.. ఈ కథలో శక్తిరాజు భార్య లక్ష్మీ (అభిరామి)(Abhirami), ప్రేయసి ఇంద్రాణి (త్రిష)(Trisha) పాత్ర ఏంటి? చివరకు అమర్, శక్తిరాజుల మధ్య పోరు ఎంత వరకు వెళ్తుంది? చెల్లిని వెతికి ఇస్తానని తాను ఇచ్చిన మాటలను శక్తిరాజు నిలబెట్టుకుంటాడా? అన్నదే మిగతా కథ.
నటి నటుల హవబవాలు :
కమల్ హాసన్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డిక్షన్, అప్పియరెన్స్, మాడ్యులేషన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. ఈ సినిమా వరకు కమల్ హాసన్ నటుడిగా వంద శాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. శింబు పాత్రలోని వేరియేషన్స్ మెప్పిస్తాయి. కొన్ని చోట్ల కమల్, శింబు కంటి చూపుల్తోనే మాట్లాడుకునేస్తారు. త్రిష పాత్ర గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదనిపిస్తుంది. ఇక అభిరామికి ఉన్నంతలో కాస్త ఎమోషన్స్ పండించే పాత్ర లభించింది. నాజర్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకుంటారు. అశోక్ సెల్వన్‌కి అయితే ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించని పాత్రను ఇచ్చారనిపిస్తుంది. తణికెళ్ల భరణి, జోజు జార్జ్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, ఐశ్వర్య లక్ష్మీ ఇలా సినిమాలోని ఏ ఇతర పాత్రలు కూడా ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించవు. ఉన్నారంటే.. వున్నారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఇండియన్ ఫిల్మ్ మేకర్‌గా మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ క్రాఫ్ట్‌ను ఎలా వాడుకోవాలో మణిరత్నంకి బాగా తెలుసు. ఈ సినిమాలోనూ టెక్నికల్ టీం హైలెట్‌గా నిలుస్తుంది. దర్శకుడు మణిరత్నం కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది. రెహమాన్ బీజీఎం అక్కడక్కడా అదిరిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. నిర్మాణ పరంగా ఈ చిత్రం ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తుంది.
విశ్లేషణ :
ఆస్తి, అమ్మాయి, అధికారం అనే వాటి కోసమే ఎక్కడైనా వైరం ఏర్పడుతుంటుంది. సొంత కుటుంబంలోనే డబ్బు, అధికారం కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ పాయింట్ మీద లెక్కలేనన్ని చిత్రాలు వచ్చాయి. పవర్ చుట్టూ తిరిగే కథకు ఎంగేజింగ్ డ్రామా, ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే ఎంతో రక్తి కడుతుంటాయి. నాయగన్ మూవీ అప్పట్లో క్లాసిక్ హిట్‌గా నిలవడానికి కారణం అదే. అందులో కమల్ హాసన్ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. యాక్టింగ్‌కి అందరూ ఫిదా అవుతుంటారు. అందులోని ఎమోషనల్ జర్నీ అందరినీ కదిలిస్తుంది. ప్రమోషనల్ కంటెంట్ గానీ చూస్తే కమల్ వర్సెస్ శింబు, వారిద్దరి మధ్య పోరు మీదే ఈ సినిమా నడుస్తుందని అందరికీ అర్థమవుతుంది. కొడుకు, తమ్ముడిలా తనని పెంచుకున్న శక్తిరాజు మీద అమర్ ఎందుకు తిరగబడతాడు? అన్న పాయింట్ అందరిలోనూ ఆసక్తిని పెంచి ఉండొచ్చు. కానీ సినిమాలో మాత్రం శక్తిరాజు, అమర్ పాత్రలో ఉండాల్సిన ఎమోషన్‌ను సరిగ్గా చూపించలేదనిపిస్తుంది. ఆ పాత్రలతో ఆడియెన్స్ ప్రయాణం చేయడం కాస్ట కష్టమే అనిపిస్తుంది. ఎక్కడా ఏ పాత్రకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ లేకుండా తీశారు మణిరత్నం. అసలు ఏ చోట కూడా వావ్ అనే సీన్ లేదు. చాలా కొత్తగా తీశారే అన్నట్టుగా కనిపించదు. అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్.మన ఊహకు అందేలానే కథ, కథనం ముందుకు వెళ్తుంటుంది. చాలా బోరింగ్‌గా, నిదానంగా సాగుతుంటుంది. అంతా ఏదో గందరగోళంగానే కనిపిస్తుంది. ఇక ఈ థగ్ లైఫ్‌ను చూస్తుంటే ఎన్నో సినిమాల రిఫరెన్సులు, ఇంకెన్నో చిత్రాల్లోని సీన్లు గుర్తుకు వస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఏ వర్గానికి కనెక్ట్ కాదు.