పెద్ద నిర్మాణ సంస్థలు సైతం యూనిట్ కి జీతాలు ఇవ్వలేని స్థితిలో టాలీవుడ్
కరోనా టైమ్ లో నిర్మాతలు అటు ఫైనాన్సర్స్ కి వడ్డీలు కట్టలేక, ఇటు తమ యూనిట్ మెంబెర్స్ కి జీతాలు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారు. సినిమాల నిర్మాణం ఆగిపోయింది. ఆఫీసు ఖర్చులను సగానికి సగం కోత పెట్టుకున్నారు. స్టాఫ్ జీతాలు సగం చేసారు. సినిమా నిర్మాణంలో లేదు కాబట్టి ఖర్చు వుండదు. అయితే డైరక్షన్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ టీమ్ కి జీతాలు మాత్రం నిర్మాత చెల్లించాలి. ఈ సమస్య పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని నిర్మాణ సంస్థలు కొట్టుమిట్టాడుతున్నాయి.
#BB3 బోయపాటి-బాలయ్య సినిమా సంస్థ కూడా సగానికి సగం జీతాలే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు మీటింగ్ పెట్టి, డైరక్షన్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ టీం కి నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి క్లారిటీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ వచ్చే నెలలో మొదలైనా, ఆరు నెలల తరువాత మొదలైనా సరే, ప్రస్తుతం యాభై శాతం జీతాలు మాత్రం ఇస్తానని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది అలా ఉండగా ఆర్ఆర్ఆర్…పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ చిత్రం అన్న విషయం తెలిసిందే. భారీ మల్టీ స్టారర్. ఎన్టీఆర్-రామచరణ్-అజయ్ దేవగన్-ఆలియాభట్-సముద్రఖని ఇలా చాలా మంది వున్నారు. ఈ సినిమా ఇప్పటికి కొంత వరకు పూర్తయింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. జూన్ నెలాఖరులో ప్రారంభించాలని అనుకున్నా హీరో లు ఎన్టీర్ రాంచరణ్ లు సముఖంగా లేకపోవడంతో షూటింగ్ మొదలవలేదు. చాలా కంపెనీల మాదిరిగా ఆర్ఆర్ఆర్ యూనిట్ లో కూడా కరోనా లాక్ డౌన్ టైమ్ లో సగం జీతాలు ఇచ్చారు. అయితే ఇకపై ఈనెలనుండి జీతాలు ఇవ్వలేమని, మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యాకే ఇస్తామని యూనిట్ సభ్యులకు నిర్మాత చెప్పేశారని తెలిసింది. ఇది టోటల్ యూనిటీకా? కాదా? అన్న సంగతి తెలియదు కానీ, యూనిట్ లోని ఓ కీలక డిపార్ట్ మెంట్ లో మంత్లీ శాలరీ బేసిస్ పై చేసే వారికీ మాత్రం మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు జీతాలు వుండవని చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన డిపార్మెంట్ వేజెస్ షూటింగ్ జరుగుతున్నప్పుడే పే చేస్తారన్న విషయం తెలిసిందే.
ఇదే మాదిరిగా ఇప్పటికే సుకుమార్ పుష్ప టీమ్ లో కొద్ది మందికి మాత్రమే జీతాలు ఇస్తున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. దాదాపు మిగిలిన బ్యానర్లు కూడా ఇదే ప్యాట్రన్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.













