ఎన్టీఆర్ తో రాహుల్ పీరియాడికల్ డ్రామా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తారక్ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ఓ యంగ్ డైరెక్టర్ తో మూవీ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో టాక్సీవాలా చేసిన రాహుల్ సంకృత్యన్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడట. రాహుల్ ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. తను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించడంలో సక్సెస్ అయిన రాహుల్ ఎన్టీఆర్ కోసం ఓ పీరియాడికల్ డ్రామాను రాశాడని తెలుస్తోంది.
ఈ కథలో హై ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్, ఆ తర్వాత వార్2 సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా ఉంది. ఈ మూడు సినిమాలను ఎన్టీఆర్ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేక ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళ్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా రాహుల్ కి ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం అది ఆయనకు జాక్ పాట్ కొట్టినట్లే అవుతుంది













