అనుకున్నదొక్కటి… అయినది ఒక్కటి!
సూపర్‌స్టార్ మహేష్‌కి కెరీర్ ఆరంభం నుంచి దర్శకులంటే ఎంతో గౌరవం. ఒక డైరెక్టర్‌తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన తర్వాత తన ఇష్టాయిష్టాలను పక్కన పెట్టేస్తాడు. డైరెక్టర్ ఏది చెబితే అది తు.చ. తప్పకుండా చేస్తాడు. ఇటీవల విడుదలైన సూపర్‌హిట్ అయిన `సరిలేరు నీకెవ్వరు` డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయంలోనూ అదే చేశాడు. తాజాగా `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో మహేష్ ఓ సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న షూటింగ్‌తో ప్రారంభిస్తే బాగుంటుందని పరశురామ్ చెప్పడం దానికి మహేష్ కూడా సై అనడంతో అదేరోజు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో షూటింగులకు అనుమతి లేదు. అయితే మే 31తో లాక్డౌన్ ముగుస్తుండడం, షూటింగుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చించిన నేపథ్యంలో తక్కువ మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ ప్రారంభించాలని భావించారు దర్శకనిర్మాతలు.
అయితే ఆరోజు షూటింగ్ చేసుకోవడానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదని తెలిసింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఓపెనింగ్ లేకపోయినా మే 31న ట్విట్టర్ ద్వారా టైటిల్ లోగో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అలాగే ఈ సినిమాకి పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా ట్విట్టర్ ద్వారానే ప్రకటించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు.













