బాబీతో బాలయ్య మూవీ?
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్య, ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో విజయాన్ని తన అకౌంట్ లో వేసుకోవాలని చూస్తున్నాడు బాలయ్య.
ఇదంతా బానే ఉంది కానీ ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో పనిచేయబోతున్నాడంటే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటితో అఖండకి సీక్వెల్ తీస్తాడని కొందరంటుంటే, బలగం డైరెక్టర్ వేణు తో సినిమా చేయబోతున్నాడని మరికొందరు అంటున్నారు. ఇది కాకుండా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా బాలయ్య మరో సినిమాకు ఓకే చెప్పాడని వార్తలొస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవితో రీసెంట్గా వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న బాబీకి కూడా బాలయ్య ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతమంది పేర్లలో బాబీ పేరే కాస్త గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలను కమిట్ అయిన బాలయ్య, వీటిలో ముందు ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతాడన్నది చూడాలి.













