ఆ కాంబో గురించి బన్నీ హింట్స్..
పుష్ప సినిమాతో తన మార్కెట్‌ను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అనే సస్పెన్స్ ఆడియన్స్ లో ఉంటూనే ఉంది. సందీప్ రెడ్డి వంగాతో సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశాడు కానీ ప్రభాస్ తో స్పిరిట్ అయ్యేవరకు సందీప్ ఏ సినిమా చేసేట్లు కనిపించట్లేదు.
ఈ లోగా త్రివిక్రమ్ తో బన్నీ ఓ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. గత కొన్నాళ్లుగా తమిళ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తాడని కూడా నెట్టింట ప్రచారం జరుగుతుంది. జవాన్ హడావిడిలో ఉండటంతో ఈ వార్తలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
జవాన్ సినిమాను చూసిన బన్నీ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్ చేశాడు. బన్నీ ట్వీట్ కు స్పందించిన అనిరుద్ థాంక్యూ బ్రో అంటూ నమస్తే ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. బన్నీ అక్కడితో ఆగకుండా కేవలం థాంక్స్ సరిపోదని, తనకి గొప్ప పాటలు కావాలని అన్నాడు. దానికి అనిరుధ్ రెడీ అంటూ ఆన్సర్ ఇవ్వడంతో బన్నీ-అట్లీ కాంబో దాదాపు ఫిక్స్ అయిందని అర్థం చేసుకోవచ్చు.
కొన్ని నెలలుగా వీరి మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయని, కానీ ఆ వివరాలను బయటకు రాకుండా చూసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు జవాన్ లో షారుఖ్ ను అట్లీ ప్రెజెంట్ చేసిన తీరు చూసి బన్నీ ఇంప్రెస్ అయ్యి పబ్లిక్ గా హింట్ ఇచ్చాడని అంటున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా ఇలా బెస్ట్ లైనప్ తో బన్నీ కెరీర్‌ను భలే ప్లాన్ చేసుకున్నాడు.













