మెగాస్టార్ బర్త్‌డే రోజు బన్నీ పోస్ట్.. కట్టె కాలే వరకు చిరంజీవి ఫ్యానే..
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్(Allu Arjun) చేసిన స్పెషల్ ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవిని తనకు మాత్రమే కాకుండా తమ అందరికీ గొప్ప సపోర్ట్ సిస్టమ్‌గా అభివర్ణించిన బన్నీ.. ఆయన అందరినీ ప్రోత్సహించి, ఎదిగేలా స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా కనిపించే ఈ బర్త్‌డే విషెస్‌లో #KKAVCF అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించడం చర్చనీయాంశంగా మారింది. దాని అర్థాన్ని నేరుగా వెల్లడించకుండా “Iykyk” అంటూ బన్నీ ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది.
అల్లు అర్జున్ గతంలో చిరంజీవిపై చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ హ్యాష్‌ట్యాగ్ వెనుక భావం ఏమిటన్నది కొంతవరకు అర్థమవుతుంది. కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అంటూ బన్నీ గతంలో చెప్పిన మాట ఫ్యాన్స్ లో బలంగా నిలిచిపోయింది. ఇప్పుడదే అభిమాన భావనను సంక్షిప్తంగా, కోడ్లా #KKAVCF ద్వారా గుర్తుచేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో బన్నీ ట్వీట్లోని ఈ చిన్న హ్యాష్‌ట్యాగ్‌నే ఫ్యాన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
చిరంజీవి వారసత్వం నుంచి మెగా కుటుంబానికి చెందిన పలువురు హీరోలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా తనదైన స్టార్డమ్తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబాల మధ్య ఈక్వేషన్స్‌పై సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్ జరిగినా.. చిరంజీవిపై తనకున్న గౌరవం, అభిమానం మాత్రం ప్రత్యేకమేనని బన్నీ తాజా ట్వీట్ ద్వారా మరోసారి చెప్పకనే చెప్పారు. అందుకే ఈ బర్త్‌డే విషెస్ ఇప్పుడు సాధారణ శుభాకాంక్షల కంటే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.








