హే “రామ్”..ఇక మాట్లాడనన్న హీరో రామ్
విజయవాడలోని స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై శనివారం తన పెదనాన్నకు చెందిన రమేష్ ఆసుపత్రి తరపున ట్వీట్ చేసిన సిని హీరో రామ్ ఇక అలాంటి పని ఎన్నడూ చేయబోనని చెప్పేశాడు. ఈ అగ్నిప్రమాదంలో కేవలం ఆసుపత్రినే లక్ష్యంగా చేసుకుంటున్నారని, అగ్నిప్రమాదానికి కారణమైన హోటల్ ని పట్టించుకోవడం లేదని, అసలు ఆసుపత్రికి అగ్నిప్రమాదానికి సంబంధం ఏమిటని రామ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తమ ఆసుపత్రిపై కొందరు కుట్ర చేస్తున్నారని, ఈ విషయంపై సిఎం జగన్ కల్పించుకోవాలని కూడా రామ్ కోరాడు. అయితే రామ్ వినతిపై సిఎం జగన్ కాదు కదా కనీసం ఆయన కేబినెట్ సహచరులు గానీ మరెవరూ స్పందించలేదు. రామ్ ప్రకటనపై స్పందించిన పోలీసు అధికారులు రామ్కి ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్కి, ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్కి తేడా తెలియకుండా మాట్లాడాడని మీడియాకు వెల్లడించారు. రామ్ ట్వీట్ అనంతరం శనివారం అంతా మీడియా స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఎక్కువ ఫోకస్ చేసింది. రామ్ ట్వీట్ వల్ల ఆసుపత్రికి ఏ ఉపయోగం లేకపోగా.. పోలీసు అధికారుల దర్యాప్తు నివేదిక నుంచి రమేష్ ఆసుపత్రి రకరకాల దారుణాలకు పాల్పడిందంటూ మీడియాకు లీకులు వచ్చాయి. దీంతో ఆదివారం ఉదయం రమేష్ ఆసుపత్రికి వ్యతిరేకంగా మీడియా కధనాలు ప్రసారమయ్యాయి. వీటన్నింటి నేపధ్యంలో కనువిప్పే కలిగిందో.. లేక ఎందుకొచ్చిన తంటా అనుకున్నాడో గాని రామ్.. ఆదివారం మరో ట్వీట్ చేశాడు. అయితే ఇకపై ట్వీట్ చేయననేదే ఈ ట్వీట్ సారాంశం. “మరో ప్రకటన చేయను. చట్టంపై మాకు నమ్మకం ఉంది. ఈవివాదానికి ఇక స్పందించను. అసలైన కుట్రదారులు తప్పక శిక్ష అనుభవిస్తారు” అంటూ రామ్ తాజా ట్వీట్లో పేర్కొన్నాడు.













